Kamareddy News: కామారెడ్డి జిల్లాలో జరిగిన ఆరు హత్యల కేసు విషయంలో కీలక వివరాలను జిల్లా ఎస్పీ సింధూ శర్మ వివరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. తాను తీసుకున్న అప్పును చెల్లించలేక ప్రసాద్ ను నమ్మించి అతని ఆస్తుల్ని కాజేసేందుకు నిందితుడు ప్రశాంత్ కుట్రలు చేసి హత్యలు చేసినట్లుగా తెలిపారు. ఆస్తుల్ని తన పేరుపైన రాయించుకున్న తర్వాత ఆ ప్రసాద్ ఫ్యామిలీ మొత్తాన్ని హత్య చేస్తే ఇక తనను అడిగే వారుండరని భావించి తన తల్లి ఒడ్డెమ్మ సహాయంతో ప్రశాంత్ ఇదంతా చేసినట్లుగా ఎస్పీ వివరించారు. ప్రధాన నిందితుడు ప్రశాంత్‌తో పాటుగా ఓ మైనర్ బాలుడు, బానోతు విష్ణు, బానోతు వంశీ అనే మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.


మంగళవారం (డిసెంబర్ 19) ఎస్పీ సింధూ శర్మ ఈ కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టారు. గత నెల 29న మాక్లూర్ మండలం మదనపల్లి వద్ద అటవీ ప్రాంతంలో రాళ్ళు, కర్రలతో కొట్టి ప్రసాద్ ను హత్య చేసిన నిందితులు ప్రశాంత్, వంశీ, విష్ణు అని సింధూ శర్మ వెల్లడించారు. మదనపల్లి అటవీ ప్రాంతంలోనే ప్రసాద్ ను నిందితులు పూడ్చి పెట్టారని వివరించారు. డబ్బులిస్తానని నమ్మబలికి తొలుత రాచర్లకూన ప్రసాద్‌ను ప్రశాంత్‌ తన వెంట తీసుకెళ్లాడు. డిచ్‌పల్లి హైవే పక్కన హత్య చేశాడని చెప్పారు. 


ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ తర్వాత డిసెంబర్ 1న ప్రసాద్ భార్య శాన్విక, చెల్లెలు శ్రావణిని నిందితుడు ప్రశాంత్ నిజామాబాద్ తీసుకెళ్లాడు. శాన్వికను భర్త దగ్గరకు తీసుకెళ్తానని చెప్పి బాసర వంతెన వద్ద తాడుతో గొంతు బిగించి చంపి గోదావరిలో నిందితులు పడేశారు. ప్రసాద్ దగ్గరికి వెళ్దామని చెప్పి శ్రావణిని సైతం తీసుకెళ్లి మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద చంపి  నిందితులు తగులబెట్టారు. ప్రసాద్ తల్లి, పిల్లలు, మరో చెల్లెలిని ప్రసాద్ దగ్గరికి వెళ్దామని చెప్పి నిజామాబాద్ లో లాడ్జిలో ఉంచాడు.. ప్రశాంత్. ఈనెల 4న ప్రసాద్ తన పిల్లల్ని చూడాలని అడిగాడని చెప్పి పిల్లలను తన మైనర్ తమ్ముడితో కలిసి చంపి మెండోర వద్ద సొన్ బ్రిడ్జి వద్ద నీళ్లలో పడేశారు.


వీటిలో నాలుగు మృతదేహాలు లభించాయి. ప్రసాద్, ప్రసాద్ భార్య మృతదేహాలు ఇంకా లభించలేదని ఎస్పీ వెల్లడించారు. ప్రసాద్‌ ఇద్దరి చెల్లెళ్లు స్వప్న, స్రవంతిని వేర్వేరుగా నిందితులు చంపేశారని చెప్పారు. వీరిలో ఒకరి మృతదేహం భూంపల్లి శివారులో లభ్యం కావడంతో ఈ మొత్తం ఘాతుకం వెలుగులోకి వచ్చింది. వరుసగా మొదటి 3 హత్యలను ప్రశాంత్‌ ఒక్కడే చేసినట్టుగా తెలుస్తోంది. మిగిలిన హత్యలను ప్రశాంత్‌ మిగతా నిందితుల సాయంతో చేసినట్టు సమాచారం.