FakeCurrency: యూట్యూబ్ చాలా మంది ఎందుకు చూస్తారు.. ఏదో టైంపాస్ కావడానికి కొందరు యూట్యూబ్ వీడియోస్ చూస్తారు. మరికొంత మంది సీరియళ్లు, సినిమాలు, ఇతర ప్రోగ్రాముల కోసం చూస్తుంటారు. మరికొందరు తమ నాలెడ్జ్ పెంచుకునేందుకు యూట్యూబ్ ను ఆశ్రయిస్తారు. ఇలా వివిధ కారణాలతో యూట్యూబ్ చూస్తుంటారా మాములుగా. అయితే కామారెడ్డిలో పోలీసులు ఓ ముఠాను పట్టుకున్నారు. వాళ్లు కూడా యూట్యూబ్ చూస్తుంటారు. అందరిలా చూస్తూ ఊరుకోలేదు. అందులో ఉన్న కంటెంట్ ప్రకారం చేయడం మొదలు పెట్టారు. చివరికి నకిలీ నోట్ల తయారీ ముఠాగా పోలీసులకు దొరికపోయారు.
రూ.1.65 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం
యూట్యూబ్ చూస్తూ దొంగ నోట్లను తయారు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ. 500 నోట్లు, రెండు బైకులు, టవేరా వెహికల్ తో పాటు నోట్ల తయారీకి కావాల్సిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియా వివరాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో నకిలీ కరెన్సీ తయారీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్ర, నాందేడ్, భైంసా, నిజామాబాద్ లకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ. 1.65 లక్షల నకిలీ కరెన్సీ, నోట్ల తయారీకి ఉపయోగించే రసాయనాలను, పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.
యూట్యూబ్ చూసి దొంగనోట్ల తయారీ
నిందితులు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్ కు చెందిన మొహమ్మద్ ఉమర్, నిజామాబాద్ జిల్లా నాగారానికి చెందిన ఒబైద్ ఖాన్, ధర్మాబాద్ కు చెందిన షేక్ ఉస్సెన్, నిర్మల్ జిల్లా భైంసా కు చెందిన మతిన్ ఖాన్, అబ్దుల్ మోయిజ్ లుగా గుర్తించారు. వీరిని కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో టెక్రియాల్ శివారులో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు రూ. ఒక లక్షా 65 వేల నగదు( 330 ఫేక్ 500 రూపాయల నోట్లు), డెస్క్ టాప్, కీబోర్టు, మౌస్, ప్రింటర్, స్కానర్, లామినేషన్ మిషన్, పేపర్ కటింగ్ మిషన్, రంగుల రసాయన సీసాలు, రెండు ద్విచక్ర వాహనాలను, టవేరా వెహికల్, 7 సెల్ ఫోన్లు, మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. షేక్ హుస్సేన్, మతిన్ ఖాన్ లు వృత్తి రీత్యా డ్రైవర్లుగా పోలీసులు గుర్తించారు. వీరికి కంప్యూటర్ పై టెక్నికల్ గా ఎక్స్ పీరియన్స్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరు భైంసా మీ సేవలో పని చేస్తూ జిరాక్స్ సెంటర్ నడిపిస్తున్నారు. దొంగ నోట్లు ఎలా తయారు చేయాలో ఐదుగురూ కలిసి యూట్యూబ్ లో చూసి తయారీ విధానాన్ని నేర్చుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అవరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను సమకూర్చుకుని దొంగ నోట్లు తయారీ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. నకిలీ 500 రూపాయల నోట్లను తయారు చేశారు. అలాగే దొంగ నోట్లను చలామణి చేయడం మొదలు పెట్టినట్టు ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కేసు చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన కామారెడ్డి రూరల్ సీఐ, ఎస్సై, సీసీఎస్ సిబ్బందిని ఆయన అభినందించారు.