Kamareddy News: కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ తో తమ జీవనాధారమైన భూములను కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ.. కౌన్సిలర్ల ఇళ్ల వద్దకు వెళ్లి మరీ వినతి పత్రాలు అందజేశారు. గత నెల రోజులుగా రైతులు.. ఈ విషయంపై ఆందోళన బాట పట్టారు. మాస్టర్ ప్లాన్ పై జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వివరణ ఇచ్చినా... రైతులు నమ్మడం లేదు. మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలకు ఈ నెల 11 వరకు గడువు ఉండటంతో కౌన్సిల్ తీర్మానంలో సంతకాలు చేసి ఆమోదం తెలిపిన 49 మంది మున్సిపల్ కౌన్సిలర్లకు ముసాయిదాను రద్దు చేస్తూ.... తీర్మానం చేయాలని వినతి పత్రాలు అందజేశారు. కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి నేరుగా కలిసి మరీ మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి అందుబాటులో లేకపోవడంతో ఆమె తండ్రి నిట్టు వేణుగోపాల్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు.
కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ కు సంబంధించి జీఓ నంబర్ 478 ప్రకారం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం నంబర్ 4/407 తేదీ 23.07.2021 రోజున ఆమోదించిన ప్రకారం కామారెడ్డి పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే దాన్ని రద్దు చేయాలంటూ గత నెల రోజులుగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తున్నారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందింది. అయితే మాస్టర్ ప్లాన్ విషయంలో పురపాలక సంఘానికి 1026 అభ్యంతరాలు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. అభ్యంతరాలకు చివరి తేదీ జనవరి 11, 2023 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్నందున... రైతులు నష్టపోకుండా ఉండడం కోసం జనవరి 12, 2023 రోజున పురపాలక సంఘం అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలోనే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ.... తీర్మానం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
దయచేసి 49 మంది కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా రైతుల పక్షాన ఉండి, తమకు సహకరించాలని కోరారు. తామ నష్టపోకుండా ఉండేలా, తమ కుటుంబాలను ఆదుకోవాలని. ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీవనాధారమైన భూమిల్ని కౌన్సిలర్లంతా కాపాడాలని కోరుతూ వినతి పత్రంలో వేడుకున్నారు. మంగళవారం ఒక్క రోజు రైతుల ఉద్యమానికి ఐక్య కార్యాచరణ కమిటీ విరామం ప్రకటించింది. 11 వ తేదీన శాంతియుతంగా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయనున్నారు.
భయపడాల్సి అవసరం లేదు: కామారెడ్డి కలెక్టర్
కామారెడ్డి పట్టణ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ప్రాథమిక దశలో ఉందని.. ఇందుకోసం డ్రాఫ్ట్ తయారు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మూడ్రోజుల క్రితమే తెలిపారు. ఇందులో అభ్యంతరాలకు నవంబర్ 13వ తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు 60 రోజులు సమయం ఇస్తున్నామని స్పష్టం చేశారు. అభ్యంతరాలను, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రైతులు తమ భూములు పోతున్నాయనే అపోహలు వదలాలని అన్నారు. గతంలో 2000 సంవత్సరంలో కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పెరుగుతున్న పట్టణ పరిధికి తగ్గట్టు మాస్టర్ ప్లాన్ కూడా మారుతుందని ఆయన వివరించారు. ఫిర్యాదులు ఇవ్వాలంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఇవ్వాలని కలెక్టర్ చెప్పుకొచ్చారు. మార్పులు, చేర్పులు అయ్యాక ఫైనల్ కు వెళ్తుందని వెల్లడించారు.