కామారెడ్డి జిల్లాలోని గుహలో తలకిందులుగా చిక్కుకుపోయి 42 గంటలుగా తీవ్రమైన నరకయాతన అనుభవిస్తున్న వ్యక్తి రాజును అధికారులు ఎట్టకేలకు కాపాడారు. దాదాపు 40 గంటల నుంచి వివిధ రకాల పరికరాలతో బండరాళ్లను తొలిచి చిక్కుకుపోయిన రాజును బయటకు తీసుకురాగలిగారు. అందుకోసం దాదాపు 7 జిలెటిన్ స్టిక్స్ ను బ్లాస్ట్ చేసి బండలను బద్దలు కొట్టారు. బయటకు తీసిన వెంటనే అప్పటికే అక్కడ వేచి ఉన్న 108 అంబులెన్సులో రాజును ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.


సెల్‌ఫోన్ బండల మధ్యలో పడిందని, దాన్ని తీసే ప్రయత్నంలో భాగంగా బాధితుడు రాజు తలకిందులుగా నెర్రెలో ఇరుక్కుపోయాడు. లోనికి చొచ్చుకుపోయి కేవలం అతని కాలు ఒక చేయి మాత్రమే బయటికి కనిపించింది. 


అధికారులకు సమాచారం అందడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టారు. పొక్లెయిన్‌ను రప్పించారు. ఆక్సీజన్ అందించడానికి ప్రాణవాయు సిలిండర్లు, పైపులను తెప్పించారు. బండలు చీల్చే యత్రాలను, జిలెటిన్ స్టిక్స్‌ను కూడా తెప్పించారు. వాటితో చుట్టుపక్కల ఉన్న భారీ బండ రాళ్లను బద్దలు కొట్టారు. చివరిగా బాధితుడు రాజు చిక్కుకున్న నెర్రె వెడల్పు కావడానికి ఆ రెండు రాళ్లను కదిలించారు.


అంతకు కొంత సేపు ముందు బాధితుణ్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా అతని స్నేహితుడు అశోక్ అనే వ్యక్తిని గుహ మరో వైపు నుంచి అత్యంత కష్టమ్మీద లోనికి పంపారు. చిక్కుకుపోయిన వ్యక్తికి పాలు, పండ్లు, నీళ్లు లాంటివి పంపారు. లోపలి నుంచి బాధితుడ్ని లాగేందుకు ప్రయత్నించినా రావడం లేదని అశోక్ తెలిపారు. బాధితుడు మాట్లాడుతున్నారని తెలిపారు. అతని చేతికి గాయం అయిన కారణంగా రక్తం కారుతుందని అశోక్ బయటికి వచ్చి చెప్పారు.