Bikkanur SI Lady constable Suicide | కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో ఇద్దరు పోలీసులు, ఓ కంప్యూటర్ ఆపరేటర్ మృతి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే వీరి ఒంటిపై గాయాలున్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. మృతదేహాల ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. వీరి మరణాలకు ముందు ఎలాంటి గొడవ, దాడులు జరగలేదు. కేవలం నీటిలో మునగడం ద్వారా వారు చనిపోయారని నిర్ధారించారు డాక్టర్లు. మరి ఏ కారణంతో వీరు ఆత్మహత్య చేసుకున్నారు అనేది తెలియడం లేదు.
అసలేం జరిగింది..
కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్‌గా చేస్తున్న బీబీపేట యువకుడు నిఖిల్ బుధవారం (డిసెంబర్ 25) మధ్యాహ్నం 1.26 గంటలకే వారి సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. కుమార్తె ఇంటికి రాకపోవడంతో శృతి తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు బుధవారం మధ్యాహ్నం నుంచి ఎస్సై సాయికుమార్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని ఆయన భార్య సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఖిల్ కనిపించడం లేదని ఆయన కుటుంబసభ్యులు చుట్టుపక్కల అందర్నీ అడిగినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో బుధవారం అర్ధరాత్రి కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరుసటి రోజు ఉదయం ఎస్సై సాయికుమార్ మృతదేహం సైతం చెరువులో నుంచి బయటకు తీశారు.
వివాహేతర సంబంధమే కారణమా?
ఎస్సై సాయికుమార్ కు వివాహమైంది. సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. బీబీపేట పీఎస్‌లో పనిచేస్తున్న సమయంలో కానిస్టేబుల్ శృతి, ఎస్సై సాయికుమార్ కు రిలేషన్ ఉందని ప్రచారం జరుగుతోంది. తరువాత ఆయన బిక్కనూరుకు బదిలీ అయ్యారు. తనతో సంబంధం పెట్టుకున్నా.. ఎస్సై తనను పెళ్లి చేసుకోకపోవడం, ఆ సమయంలో తనకు పరిచయమైన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ను శృతి ప్రేమించింది. వీరు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో అడ్లూరి చెరువులో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వివాహేతర సంబంధమే ముగ్గురి ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఆత్మహత్యపై శృతి, నిఖిల్ ఛాటింగ్..
ఒకేచోట, ఒకేసారి ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంపై పోలీసులు కారణాలు అన్వేషిస్తున్నారు. కేసులో నిఖిల్, శృతిల చాటింగ్ కీలకంగా మారనుంది. నేను సూసైడ్ చేసుకుంటా అంటే.. నేను కూడా సూసైడ్ చేసుకుంటానని నిఖిల్, శృతి మధ్య చాటింగ్ జరిగినట్లు సమాచారం. వీరి ఫోన్లోలో డేటా పరిశీలిస్తున్నారు. ఎస్సై సాయికుమార్ కు చెందిన మూడు ఫోన్లలో ఒకటి అన్ లాక్ కాగా, పోలీసులు వివరాలు చెక్ చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, సూసైడ్ కు సంబంధించిన లేఖలు లేకపోవడంతో కేసు ముందుకు పోవడం లేదు. శుక్రవారం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. శనివారం మరోసారి చెరువు వద్ద సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది.