కేంద్రం ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని నిబంధనలు ఉన్నా అవి ఎక్కడా అమలు కావటం లేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విచ్చల విడిగా ప్లాస్టిక్ వాడకం జరుగుతూనే ఉంది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ప్లాస్టిక్ ను వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జులై 1 నుంచి దేశవ్యాప్తంగా పాలిథిన్ సంచులు, గ్లాసులతో పాటు మరికొన్ని వస్తువులను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. 

గ్రామాలు, పట్టణాల్లో పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. పల్లెల్లో ప్లాస్టిక్ వినియోగిస్తే రూ.500- 5 వేల వరకు, పురపాలికల్లో రూ.500 - 25 వేల వరకు జరిమానాలు విధించాలని పేర్కొన్నారు. ఈ మేరకు తనిఖీలు చేపట్టిన సిబ్బంది వివిధ దుకాణ సముదాయాలకు నోటీసులు జారీ చేశారు. కొందరికి జరిమానాలు విధించారు. దీంతో మిగతా వ్యాపారులు ప్లాస్టిక్ ను కొన్ని రోజులు బహిష్కరించాయి. తర్వాత షరామామూలే అయింది. ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు దొరుకుతున్నాయి. 

 

దొంగచాటుగా ప్లాస్టిక్ నిల్వలు..

పలు దుకాణ దారులు పాలిథిన్ సంచులను రహస్యంగా తెప్పించుకుంటున్నారు. వాటిని ఇళ్లలో నిల్వ చేసుకొని విడతలు విడలుగా బయటకు తీసుకొస్తున్నారు. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు గతంలో తెప్పించిన సరకులో చివరగా మిగిలింది ఇదేనంటూ చూపిస్తున్నారు. కాగా నిషేధం తర్వాత మునుపటి కంటే చౌకగా ప్లాస్టిక్ వస్తువులు లభ్యమవుతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో కఠినంగా వ్యవహరించిన అధికారులు తర్వాత చేతులెత్తేశారనే విమర్శలున్నాయి. పంచాయతీలు, పల్లెల్లో కలిపి మొత్తం 50కి మించి జరిమానాలు విధించింది లేదు. దీనినే అలుసుగా తీసుకుంటున్న వ్యాపారస్థులు మళ్లీ యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. 

 

గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణ జరుగుతోంది. పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా కంపోస్టు షెడ్డుకు తరలిస్తున్నారు. అక్కడే ప్లాస్టిక్, చెత్త, సీసాలు, ఇనుప వస్తువులు వేరు చేయడానికి స్థానికంగా ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకున్నారు. కొన్ని చోట్ల మండలానికి ఒకటి చొప్పున ఉండగా మరికొన్ని చోట్ల రెండు మండలాలకు ఒకే ఏజెన్సీ ఉంది. వ్యర్థ్యాలు పోగైనట్లు సమాచారం అందించగానే గ్రామానికొచ్చి తీసుకెళ్లేలా ఒప్పందం చేసుకున్నారు. కొన్ని గ్రామాల్లో ప్లాస్టిక్ సేకరణ సరిగా జరగడం లేదు. ఇనుప వస్తువులు, సీసాలనే తీసుకెళ్తున్నారు. ఏం చేయాలో తెలియక స్థానిక సిబ్బంది కాల్చివేస్తున్నారు. 

 

మూడున్నరేళ్ల కిందట జిల్లావ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం పై అనేక చైతన్య కార్యక్రమాలు రూపొందించారు. నాటి అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి పంచాయతీ ప్లాస్టిక్ సేకరించి రీసైక్లింగ్ కు పంపించారు. మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలైంది. చాలా పంచాయతీలు ప్లాస్టిక్ నిషేధిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ప్రజలకు జనపనార సంచులు పంపిణీ చేశారు. ఆ తర్వాత అటువంటి కార్యక్రమాలు తగ్గిపోయాయి. ఇటు అధికారులు సైతం చూసిచూడనట్లు వ్వవహరిస్తుండటంతో ప్లాస్టిక్ వాడకం మళ్లీ మామూలుగా మారిపోయింది. ప్లాస్టిక్ వాడకంపై చర్యలు తీసుకోవాలని నిబంధనలు ఉన్నా.. అధికారులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయ్.