Adilabad latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీదుగా పక్కన ఉన్న మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. నెలలు తరబడి పదుల సంఖ్యలో అక్రమ బియ్యం తరలిస్తున్న వాహనాలు చిక్కుతున్నాయి. అయినా అధికారులు చూస్తూ ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం పోలీసులకు మాత్రమే ఈ రేషన్ బియ్యం పట్టుబడటం ఆలోచనలకు గురిచేస్తోంది.
సంబంధిత శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే అక్రమ రేషన్ బియ్యం రవాణా సాగుతోందని చర్చించుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లారీలో మహారాష్ట్రకు తరలిస్తుండగా బోరజ్ చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు.
Also Read: అఖిల పక్ష సమావేశానికి బీజేపీ, బీఆర్‌ఎస్ గైర్హాజరుపై ప్రభుత్వం రియాక్షన్ ఇదే !
బోరజ్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద 44వ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీ చేశారు. 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలిస్తుండగా జైనాథ్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం సిబ్బందితో కలిసి మాటువేశారు. మధ్యప్రదేశ్‌లోని బాలఘట్‌కు రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. డ్రైవర్ తాహిర్ తో పాటు లారీ యజమాని ఎం.డీ నజీం, బియ్యం సరఫరా చేస్తున్న నాగనాథ్, షఫీపై కేసు నమోదు చేశారు.
విషయం తెలుసుకున్న అదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి అక్కడకు చేరుకొని పట్టుకున్న బియ్యం లారీని పరిశీలించారు. ఎన్ఫోర్స్మెంట్ ఉప తహసీల్దార్ రాఠోడ్ రవీందర్ అక్కడకు చేరుకొని పంచనామా నిర్వహించారు. 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: పెళ్లయిన నెల రోజులకే నవ వధవు ఆత్మహత్య, హైదరాబాద్‌లో విషాదం
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోను రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. సరిహద్దు ప్రాంతం మీదుగా మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు తరలిస్తున్నారు. వారం రోజుల క్రితం నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద తక్కువ రేటుకు కొని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు. ఆ పీడీఎస్ బియ్యాన్ని కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన పక్కా సమాచారంతో మాటు వేసి పట్టుకున్నారు. కెరమెరి మండలంలోని వివిధ గ్రామాల నుంచి సేకరించిన బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు. అనార్‌పల్లి వద్ద బానోత్ విజయ్ కుమార్ బొలెరో వాహనంతో తీసుకెళ్తున్న 8 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు.
నిర్మల్ జిల్లాలోనూ ఇటీవలే భారీగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. భైంసా పట్టణానికి చెందిన పీడీఎస్ బియ్యంగా గుర్తించారు. వెంటనే సంబంధిత డీటీ, సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చారు. దాదాపు 30 టన్నులపైనే పీడీఎస్ బియ్యం ఉన్నట్లు తెలిపారు. ఈ బియ్యాన్ని పక్కనున్న మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నెల వ్యవధిలోనే పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పోలీసులకు పట్టుబడడం ముమ్మాటికి ఇది అధికారుల నిర్లక్ష్యమేనని సంబంధిత శాఖ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.