తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న అనూహ్య నిర్ణయాలు నిజామాబాద్‌ రాజకీయాల్లో లెక్కలు మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు కూల్‌గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్సీల కోసం లీడర్లు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. 


ఎమ్మెల్సీ కవిత రాజ్యసభకు వెళ్తారన్న ప్రచారం


ఎమ్మెల్సీ కవిత రాజ్యసభకు వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఆ కోటాలో ఎమ్మెల్సీగా కవిత కొనసాగుతున్నారు. కవితే ఆ స్థాైనం నుంచి పోటీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ కవిత రాజ్యసభకు వెళ్తున్నారన్న ప్రచారంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. లోక‌ల్ బాడీ నుంచి నిజామాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌ళ్లీ క‌విత‌కే ఛాన్స్ ఇద్దామ‌ని అనుకున్నారు. కానీ ఆమె మొద‌టి నుంచి ఈ ఎమ్మెల్సీ కొంత అనాసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 


ఎమ్మెల్యే కోటాలో ఆకుల లలితకు దక్కని చోటు


 ఏడాది క్రితం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికకు ముందు కవితకు రాజ్యసభ ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి ఇచ్చింది టీఆర్ఎస్ అధిష్టానం. భూప‌తిరెడ్డి స‌స్పెండ్‌తో ఖాళీ అయిన లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీ గా ఆమెకు అవకాశం వచ్చింది. ఏడాది పాటు ఆమె కొన‌సాగారు. ఇప్పుడు మ‌ళ్లీ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నిక నోటిఫికేషన్ పడింది. ఈసారి కూడా ఆమెకు ఇస్తార‌ని అంతా అనుకుంటున్న సమయంలో కవితకు రాజ్యసభ ఇస్తారన్న ప్రచారంతో ఆశావహుల్లో ఆశలు మొదలయ్యాయ్. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆకుల ల‌లిత‌కు ఎమ్మెల్యే కోటా కింద రెన్యూవ‌ల్ చేస్తార‌ని చివ‌రి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగినా.. బీసీ కోటాలో బండ ప్ర‌కాశ్‌కు అవకాశం ఇచ్చింది టీఆర్ఎస్ అధిష్టానం. 


బండ ప్రకాశ్ కు కేబినెట్‌లో స్థానం


బండ ప్ర‌కాశ్ రాజ్య‌స‌భకు రాజీనామా చేయ‌నున్నారు. డీఎస్‌, కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావుది కూడా ట‌ర్మ్ మార్చితో ముగియనుంది. రాజ్య‌స‌భ‌కు మార్చిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నిక‌ల్లో క‌విత‌కు అవ‌కాశం ఇస్తే.. ఆమెకు స‌ముచిత స్థానం, గౌర‌వం దక్కుతుందని భావిస్తున్నారు. కవిత కూడా రాజ్యసభకే మొగ్గు చూపుతున్నట్లు అనుకుంటున్నారు. మొదటి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి దక్కుతుందని భావించినప్పటికీ ఆమెకు మినిస్ట్రీ దక్కలేదు. ఇప్పుడు లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీ ఇచ్చినా.. మంత్రి ప‌ద‌వి వ‌చ్చే పరిస్థితులు లేవన్న ప్రచారం ఉంది. ఈట‌ల ఎపిసోడ్ తో ముదిరాజ్ కులానికి చెందిన బండ ప్ర‌కాశ్‌కు మంత్రి వ‌ర్గంలో చోటివ్వాల‌ని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కవిత మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తే గెలుస్తారు. కానీ మంత్రి పదవి రాకుంటే అన్న మీమాంసలో ఉన్నట్లు తెలుస్తోంది. 


ఆశావహుల్లో పెరిగిన పోటీ


నిజామాబాద్ జిల్లాలో ఇపుడు ఆశావహుల్లో పోటీ పెరిగింది. ముఖ్యంగా ఆకుల లలిత, బిగాల మహేశ్ గుప్తా, అరికెల నర్సారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నిక బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే కవిత రాజ్యసభకు ఆసక్తి చూపుతున్నారా లేదా అనేది మాత్రం తెలియదు. ఇది ఒక ప్రచారమే అంటున్నారు కొందరు. ఒక వేళ ఆమె రాజ్యసభకు ఇంట్రస్ట్ చూపితే ఆకుల లలితకు ఇస్తారా ? లేక బిగాల మహేష్ గుప్తకు ఇస్తారా ? ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ఎవరి వైపు మొగ్గుతారన్నది చూడాలి మరి.  


Also Read: ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య... పురుగుల మందు తాగి ప్రయాణం... సిబ్బంది స్పందించినా నిలవని ప్రాణాలు


Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు


Also Read: గురువారం ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా .. వరి కొనుగోలుపై కేంద్రం తేల్చాల్సిందేనన్న కేసీఆర్ !