Komaram Bheem Asifabad District News: కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రజలను వణికిస్తున్న పులి కోసం వేట ఇంకా కొనసాగుతోంది. రైతుపై దాడి తర్వాత ఎలాంటి అలజడి లేదని అధికారులు భావిస్తున్నారు. అయినా ప్రమాదం లేదని చెప్పలేమని అంటున్నారు. అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రిస్క్ తీసుకోవద్దని చెబుతున్నారు. పొలం పనులకు వెళ్లాల్సి వస్తే మాత్రం గుంపుగానే వెళ్లాలని చెబుతున్నారు. 


కొన్ని నెలల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలను పులులు బెంబేలెత్తిస్తున్నాయి. మొన్నటి వరకు పశువులపై మాత్రమే దాడి చేసిన పులులు ఇప్పుడు మనుషులపై కూడా దాడులు చేస్తుండటంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. మొన్న సిర్పూర్‌ మండలంలోని దుబ్బగూడలో రైతపై దాడిన చేసిన తర్వాత పులి ఇటికలప హాడ్ అడవుల వైపు వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. ఆదివారం అనుమానం ఉన్న ప్రాంతాల్లో అధికారులు పరిశీలించారు. వారికి పులికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. 


పులి అడవిలోకి వెళ్లిపోయినంత మాత్రాన ప్రమాదం లేదని భావించలేమని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆసిపాబాద్ మండలం దానాపూర్ అటవీ ప్రాంతానికి సమీపంలో మేకల మందపై పులి దాడి చేసింది. ఓ మేకను హతమార్చింది. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు కూడా భయపడుతున్నారు. మరోవైపు కెరమెరి, జోడేఘాట్ ప్రాంతాల్లో సంచరించిన పులే దానాపూర్ అడవులకు వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 


Also Read: పులి సంచారంతో వణికిపోతున్న కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ప్రజలు- కాగజ్‌నగర్‌ మండలంలో 144 సెక్షన్


ఇటికలపహాడ్ అడవిలోకి వెళ్లిన పులి అటు నుంచి అటే మహారరాష్ట్ర అడవులకు వెళ్లే అవకాశం ఉంందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ అడవుల్లో ఇప్పటికే రెండు పులులు తిరుగుతున్నాయని అంటున్నారు. వాటితో జత కట్టి ఛాన్స్ ఉందని అంటున్నారు. జత కోసం వెతికే క్రమంలో అడ్డంగా వచ్చిన వారిపై మాత్రమే పులులు దాడి చేస్తున్నాయని... కావాలని ఆహారం కోసం మనుషులపై పడే పరిస్థితిలేదని అంచనా వేస్తన్నారు. 


సిర్పూర్(టి) మండలం చుట్టుపక్కల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లోనే పులి ఉందని అధికారులు చెప్పడంతో ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. చాలా మందికి రోడ్లపైనే దర్జాగా తిరుగుతున్న పులి కనిపించిందని అంటున్నారు.  పులి జాడ కనిపెట్టేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలను సైతం వినియోగిస్తున్నారు.  


ప్రస్తుతం అధికారుల అంచనా ప్రకారం ఈ ప్రాంతంలో నాలుగు పులులు తిరుగుతున్నాయని అంటున్నారు. ఈ మాట విన్న ప్రజలకు మరింత భయం పట్టుకుంది. భయం వద్దని వాటి జోలికి వెళ్లనంత వరకు పులులు మనుషులపై దాడి చేయబోవని అంటున్నారు. దీని కోసం వారికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వారికి మాస్క్‌లు అందిస్తున్నారు. వాటిని పెట్టుకొని పని చేసుకోవాలని చెబుతున్నారు. వాటిని చూసి పులి పక్కకు వెళ్లిపోతుందని అంటున్నారు. పనికి వెళ్లే వాళ్లంతా గుంపుగానే ఉండాలని.. నాలుగు గంటల లోపు పొలం నుంచి వచ్చేయాలని సూచిస్తున్నారు. 


Also Read: కుమ్రంభీం ఆసీఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో పులి పని పట్టేందుకు కొత్త ఎత్తుగడ- రంగంలోకి దిగిన డ్రోన్ సైన్యం