నిజామాబాద్ మార్కెట్లో పసుపునకు క్వింటాకు 10 వేల రూపాయలు ధర పలికింది. ఈ ఏడాది పడ్డ అకాల, అతి వర్షాలకు పసుపు పంట చాలా వరకు దెబ్బతిన్నది. పంట కుళ్లిపోయిన రైతులు చాలా వరకూ నష్టపోయారు. అలాంటి పసుపు తక్కువ ధర పలుకుతోంది. రైతులను ఆదుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రికి లేఖ రాశానన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. కానీ ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు.
ప్రకృతి వైపరిత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను ప్రారంభించింది. కానీ తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఈ పథకానికి తన వాటా ప్రీమియం చెల్లించకపోవడంతో ఇప్పుడు రైతులకు తీరని నష్టం జరుగుతోందని అన్నారు ఎంపీ అరవింద్. ప్రీమియం చెల్లించి ఉంటే ఇప్పుడు రైతులకు బీమా కింద నష్టపరిహారం అందేదని.. అలాగే ధర తగ్గినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులను ఆదుకునే అవకాశం ఉన్నా.. కేంద్రం సహకరిస్తామని చెప్పినా.. ముఖ్యమంత్రి లేఖ రాయకుండా రైతులను కష్టాల పాలు చేస్తున్నాడని అన్నారు ఎంపీ అరవింద్.
ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరిచి రైతులను తక్షణమే ఆదుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు అరవింద్. నాణ్యమైన పంటకు ఇప్పటికి కూడా నిజామాబాద్ మార్కెట్లో మంచి ధరే పలుకుతుంది. మంచి పసుపును రైతులు సాంగ్లీకి తీసుకుపోయి అమ్ముకున్నా.... అక్కడ కూడా 11 వేల రూపాయలపైనే ధర పలుకుతోందని అన్నారు. గతేడాది కూడా పసుపు ధర నిజామాబాద్ మార్కెట్లో రూ. 10 వేల పైనే పలికిందని చెప్పారు ఎంపీ అరవింద్. వరుసగా రెండేండ్లు పసుపు పంటకు మంచి ధర రావడం ఆనందం కలిగిస్తోందని ఎంపీ అరవింద్ చెప్పారు.