దేశంలో ఉన్న చాలా మంది ముఖ్యమంత్రులకు, ఇతర పార్టీ నాయకులకు మోదీ గురించి అర్థమైపోయిందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్రాల్లో ఉన్న అధికారాన్ని తీసుకుని తామే చేస్తున్నామని మోదీ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో చాలా ఏళ్ల పాటు కలిసి ఉన్న శివనేనను విడ గొట్టి డ్రామా ఆడుతున్నారని చెప్పారు ప్రశాంత్‌ రెడ్డి.


రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్‌తో దేశ ప్రజలు కలిసివస్తారని చెప్పుకొచ్చారు ప్రశాంత్‌ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం దేశంలో జరగాలన్న ఎజెండాతో ముందుకువెళ్తున్నామని అన్నారు మంత్రి. ప్రధాని స్వయంగా రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటు సరిగ్గా జరగలేదని అనడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు మోదీ మీద ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు పద్దతి సరిగ్గా జరగలేదన్న మోదీ వ్యాఖ్యలను నిజామాబాద్ ఎంపీ అరవింద్ సమర్ధించటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో అరవింద్‌ను గ్రామాల్లో ప్రజలు అడ్జుకుంటారని అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని ఇందులో భాగంగానే బీజేపీ నేతలకు నిరసనలు ఎదురవుతున్నాయని మంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని ప్రశ్నిస్తే రాష్ట్ర బీజేపీ నేతలు సమర్ధించడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మాటలను రాసిన తెలంగాణ పత్రికలపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు పంపి తమ అవగాహన రాహిత్యం మరోసారి రుజువు చేసుకున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బిజెపి అగ్ర నాయకుడు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని జాతీయస్థాయిలో అందరూ కోరుకుంటున్నారని తెలిపారు ప్రశాంత్ రెడ్డి. దేశ ప్రధాని అయ్యే అన్ని అర్హతలు కేసీఆర్ కున్నాయని.. దిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయడం బిజెపి నాయకులకు అలవాటుగా మారిందన్నారు మంత్రి. ఇచ్చిన మాట నెరవేర్చకుండా ప్రజల్లోకి వస్తే అడ్డుకుంటారని అన్నారు. 


తరుణ్ చుగ్ మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అయన ఇప్పటి వరకు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంట్ లో ప్రశ్నిస్తుంటే అడ్డుకోలేని ఈ ఎంపీ లు వెంటనే రాజీనామా చేయాలి అని అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.