భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఈ విషయం తెలిసిన బాధిత మహిళ న్యాయ పోరాటానికి దిగింది. నిజామాబాద్(Nizamabad) జిల్లా దర్పల్లికి చెందిన  సిద్దిరాములు చిన్నయ్యతో సిద్దిరాములు శాంతకు 2014లో వివాహం జరిగింది. శాంతకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. శాంత వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నారు. భర్త చిన్నయ్య తనను నిత్యం వేధించేవాడని శాంత ఆరోపిస్తున్నారు. 2021 జులై లో మంచిర్యాల(Machiryala) జిల్లా రామకృష్ణపురానికి చెందిన కడమంచి శిరీషను రెండో పెళ్లి చేసుకున్నాడు చిన్నయ్య. ఈ విషయం తెలుసుకున్న శాంత 2021 ఆగస్టులో చిన్నయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంత వరకు పోలీసులు పట్టించుకోలేదని శాంత ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ సీపీ నాగరాజును కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు బాధితురాలు శాంత. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు ఆవేదన చెందారు. చిన్నయ్య సివిల్ కానిస్టేబుల్(Constable) గా విధులు నిర్వహిస్తున్నాడు. 



నల్గొండ జిల్లాలో మరో ఘటన 



 భార్యకు తెలియకుండా భర్త రెండో పెళ్లి చేసుకుంటుండగా భార్యే అతడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన ఆదివారం జరిగింది. నిందితుడిది తెలంగాణలోని నల్గొండ జిల్లా. భువనగిరి ప్రాంతానికి చెందిన చెరుకుమల్లి మధు బాబు అనే వ్యక్తికి హైదరాబాద్‌ బోడుప్పల్‌కు చెందిన సరిత అనే యువతితో నాలుగేళ్ల క్రితమే వివాహం జరిగింది. కొన్నేళ్లకు అత్తగారింటి వారు వరకట్న వేధింపులకు పాల్పడ్డారు. దీంతో గత మూడేళ్లుగా సరిత పుట్టింటికి వచ్చేసి తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ ఉంది. తనపై వరకట్న వేధింపులకు పాల్పడ్డారని భువనగిరి పోలీస్‌ స్టేషన్‌లో సరిత అప్పుడే కేసు పెట్టింది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణ దశలో ఉంది.


ఇదిలా ఉండగా.. భర్త మధుబాబు గతంలో రెండు సార్లు వివాహం చేసుకోబోగా భార్య సరిత అడ్డుకుంది. ఈ సారి మధుబాబు కోదాడ సమీపంలోని గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించుకుని పెళ్లి చేసుకునేందుకు ఆదివారం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి వచ్చారు. ఆలయంలో పెద్ద తిరునాళ్లు కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడే ఉండే బేడా మండపంలో వివాహం గుట్టుగా జరుగుతుండగా.. సరిత ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా పెళ్లి కొడుకు మధుబాబుపై మెరుపు దాడి చేశారు. వెంటనే వివాహాన్ని అడ్డుకున్నారు. 


గతంలో జరిగిన వివాహం గురించి పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు వీరంతా చెప్పడంతో.. వారు మధుబాబు కుటుంబ సభ్యులపై మండి పడి అక్కడి నుంచి తిట్టుకుంటూ వెళ్లిపోయారు. మధుబాబును పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. తర్జనభర్జనల అనంతరం ఇప్పటికే భువనగిరి పోలీస్‌ స్టేషన్‌లో కేసు విచారణలో ఉన్నందున పెనుగంచిప్రోలులో కేసు అవసరం లేదని వెళ్లిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు.