తెలంగాణ ప్రభుత్వం మెడలు వంచి అయినా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని... కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల వెంటే ఉంటుందని సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా... లేకున్నా కాంగ్రెస్ ప్రజల మధ్యలోనే ఉంటుందన్నారు. ఢిల్లీలో తెలంగాణ ఎంపీలతో ధర్నా చేయిస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ ఎంపీలను తిరిగి ఎందుకు హైదరాబాద్‌కు రప్పించాడని ప్రశ్నించారు. 
కామారెడ్డి పట్టణంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ జరిగిన సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తోడు దొంగలే అని ఆరోపించారు. ఢిల్లీకి దండయాత్రకు పోతున్నాం అని చెప్పి సీఎం కేసీఆర్ సైతం ఎందుకు వెనకడుగు వేశారో రాష్ట్ర రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ను దేశంలో ఎవరూ నమ్మరని అన్నారు. శరత్ పవార్ ఓ సందర్భంలో దేశంలో మోస్ట్ అన్ బిలీవ్డ్ లీడర్ ఎవరు అంటే కేసీఆర్ అని చెప్పారని ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీని సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ గా ఎందుకు పిలవడం లేదని.. తమ పార్టీకి హోదా ఇస్తే నష్టమని భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
Also Read: Gold-Silver Price: స్థిరంగా బంగారం ధర.. రూ.100 తగ్గిన వెండి.. నేటి తాజా ధరలు ఇవీ..
వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. కేసీఆర్ మాట విని తెలంగాణ రైతులు వరి వేస్తే ప్రస్తుతం కొనుగోలు చేయమంటూ మాట మార్చారని.. ఇది రైతులను మోసం చేయడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరిని కొనుగోలు చేస్తామని గతంలోనే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పారని.. ఇప్పుడు కోనుగోలు చేయలేమని అంటున్నారని.. దీనికి సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
రాష్ట్ర రైతులకు మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ..
తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం మొదలైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రంలో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తున్న పరిస్థితుల్లో వానలు రాక, కరెంటు లేక, సాగు నీరు అందక నిత్యం యుద్ధం చేస్తున్న పరిస్థితి ఉండేదన్నారు. అలాంటి పరిస్థితులలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే సమస్యల పరిష్కారానికి మార్గమని నమ్మి ముఖ్యమంత్రి కేసీఆర్ మలి దశ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారని రాష్ట్ర రైతులకు రాసిన బహిరంగ లేఖలో నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. 14 ఏళ్ల సుధీర్ఘ ఉద్యమం, అనేక మంది అమరుల త్యాగాలు, ప్రజల అండదండలతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, ప్రజాస్వామ్యబద్దంగా పార్లమెంటును ఒప్పించి  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని లేఖలో చెప్పారు. 
Also Read: తెలంగాణ రైతులకు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ.. ఏం చెప్పారంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి