Congress party Janahita padayatra | నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జనహీత పాదయాత్ర కార్యకర్తల్లో జోష్ నింపింది. ముందుగా సూర్జాపూర్ ఎన్టీఆర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి జాతీయ గీతాలపన, మా తెలుగుతల్లి గీతాలతో దేశ సమగ్రత కోసం అసువులు బాసిన సమరయోధులను స్మరించి అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. మస్కాపూర్, మీదుగా ఖానాపూర్ పట్టణంలో పాదయాత్ర నిర్వహించి, తెలంగాణ చౌక్ లో కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో మార్పు..
జనహిత పాదయాత్ర ప్రధాన ఉద్దేశం, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించే బాధ్యతతోపాటు కేసీఆర్ నేతృత్వంలోని పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు- పద్దెనిమిది నెలల రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాల తేడాను వివరించే ప్రయత్నం శ్రేణుల్లో ఆసక్తిని నింపింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్, నిర్మల్ డిసిసి అధ్యక్షుడు శ్రీహరి రావ్ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. బనకచర్లపై భారాస రాద్ధాంతం చేస్తోందన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కడెం ప్రాజెక్టు ఎక్కడుందో తెలియదని గత వరదల సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. ఆదివాసీల ప్రేమ అచంచలమైందని, కాంగ్రెస్ రాజనీతిలో వారి ప్రేరణ ఇమిడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను ఏకం చేయడం, ప్రజాసంక్షేమాన్ని కోరుకోవడం, ఆదివాసీ సంస్కృతి నుంచి నేర్చుకుందని చెప్పారు. దానికి భిన్నంగా 'జల్ జంగల్ జమీన్' కోసం పోరాడిన ఆదివాసీ వీరుల స్వప్నాలకు తూట్లు పొడిచేలా కొన్ని శక్తులు వ్యవహరిస్తున్నాయంటూ బీజేపీపై ధ్వజమెత్తారు. గల్ఫ్ దేశాల్లో ప్రాణాలు కోల్పోయిన వలస బాధితుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీకి
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దిల్లీ వెళ్తున్నట్లు మీనాక్షి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా ప్రజలకు లభ్భిచెకురేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఈ సంక్షేమ పథకాల విషయంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వానీకి, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడాను తెలిసేలా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రభుత్యం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు.
ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న నలుగురు బిజెపి ఎమ్మెల్యేలు బిసి రిజర్వేషన్ల గురించి మాట్లాడటం లేదని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే భాజపా ఎమ్మెల్యేలు నోరుమెదపడం లేదన్నారు. రిజర్వేషన్లను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రేడ్డికి వత్తాసు పలుకుతున్నారనీ, వారిని బీసీలు క్షమించరు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కిషన్ రెడ్డి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నా ఎంపీలు సంజయ్, ఈటల రాజేందర్, అర్వింద్ లు ఎందుకు ఖండించడం లేదన్నారు. ఇక భారాస నాలుగు ముక్కలైంది. కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. హరీశ్ రావు అదను కోసం ఎదురుచూస్తున్నారు. దోచుకున్న సంపద పంపకాల తేడాల్లో భాగంగానే కేటీఆర్, కవితకు మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు. మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్యం ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలందరూ ముందుండాలన్నారు.