గత 9 ఏళ్ల తెలంగాణ చరిత్రలో ఒకటి రెండు దెబ్బలు తిన్నామని, కరోనా, నోట్ల రద్దు వంటివి కోలుకోలేని దెబ్బలు తీశాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు కనిపిస్తున్న ప్రగతి అనేది గతంలో చేసిన కృషి అని అన్నారు. ఈ ప్రగతిలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి ధన్యవాదాలు తెలిపారు. మంచిర్యాలలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. నూత‌న క‌లెక్ట‌రేట్‌లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌ల్లో కేసీఆర్ పాల్గొన్నారు. అంత‌కుముందు పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని కేసీఆర్ స్వీక‌రించారు.


తెలంగాణ నేడు అనేక విషయాల్లో నెంబర్ 1గా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయం, తాగునీరు, ఆహార ఉత్పత్తి తదితర అన్ని విషయాల్లో మొదటి స్థానంలో నిలిచామని అన్నారు. ప‌సికూన అయిన 10 సంవ‌త్స‌రాల తెలంగాణ‌.. మిగ‌తా రాష్ట్రాల‌తో పోటీ ప‌డుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ముందంజ‌లో ఉన్న తెలంగాణ‌.. కేంద్రం నుంచి అనేక అవార్డుల‌ను అందుకుంద‌ని కేసీఆర్ తెలిపారు. 


గొర్రెల ఉత్పత్తిలో మనమే నెంబర్ 1


రెండో విడత గొర్రెల పంపిణీని మంచిర్యాల నుంచే ప్రారంభించుకోబోతున్నామని అన్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొనే బీసీలను ఆదుకుంటామని చెప్పారు. నాయి బ్రాహ్మణులకు రూ.లక్ష, రజకులకు, ఇతర చేతిపనుల వారిని ఆదుకొనేందుకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. యాదవులు అధికంగా ఉన్న తెలంగాణలో గొర్రెలను దిగుమతి చేసుకోవడం ఏంటని, తానే ఉత్పత్తి పెంచాలని గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ విషయంలో కూడా దేశంలోనే మొదటి స్థానంలో ఉంటామని అన్నారు.


‘‘ఆసిఫాబాద్ క‌లెక్ట‌రేట్‌ను కూడా త్వ‌ర‌లోనే ప్రారంభించుకోబోతున్నాం. ప్ర‌జ‌ల‌కు వార‌ధిగా ఉద్యోగులు ప‌ని చేయ‌డంతో, మంచి ఫ‌లితాల‌ను సాధించాం. మాన‌వీయ కోణంలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నాం. ఆరోగ్య శాఖ బ్ర‌హ్మాండ‌మైన పురోగ‌తి సాధించింది. మాతాశిశు మ‌ర‌ణాలు త‌గ్గాయి. కంటి వెలుగు లాంటి ప‌థ‌కం దేశంలో ఎక్క‌డా లేదు. కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని ఢిల్లీ, పంజాబ్‌లో కూడా ఆ ముఖ్య‌మంత్రులు కూడా అమ‌లు చేశార‌ు’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా డిమాండ్ ఎప్ప‌టి నుంచో ఉందని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కాబ‌ట్టే మంచిర్యాల‌ను జిల్లాగా ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్ అన్నారు. ప్ర‌జ‌ల‌కు మంచి జ‌ర‌గాల‌నే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.


ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన


మంచిర్యాల పర్యటనలో భాగంగా రూ.1,748 కోట్లతో చెన్నూర్‌, పర్ధాన్‌పల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు, రూ.510 కోట్లతో మెడికల్‌ కాలేజీ, రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర ఏర్పాటు చేయనున్న ఆయిల్‌ పాం ఫ్యాక్టరీ నిర్మాణ ప‌నుల‌కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గోదావరిపై రూ.164 కోట్లతో నిర్మించే మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జికి కేసీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, మంత్రులు ప్ర‌శాంత్ రెడ్డి, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, ఎంపీ వెంక‌టేశ్ నేత‌, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, దివాక‌ర్ రావు, దుర్గం చిన్న‌య్య‌, జోగు రామ‌న్న‌, రేఖా నాయ‌క్‌తో పాటు ప‌లువురు ప్రజాప్ర‌తినిధులు పాల్గొన్నారు.