గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. జూన్ 11న జరగనున్న ప్రిలిమ్స్ పరీక్షపై జోక్యానికి ధర్మాసనం నిరాకరిస్తూ.. అప్పీల్‌ను కొట్టివేసింది. గ్రూప్- 1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలన్న పిటిషన్లను ఇటీవల సింగిల్ జడ్జి కొట్టేయగా.. ఆ ఉత్తర్వులను ధర్మాసనం వద్ద ఓ విద్యార్థి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర రావుతో కూడిన హైకోర్టు ధర్మాసనం.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిలిపివేయడం పరిష్కారం కాదని అభిప్రాయపడింది.


గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి జూన్ 11న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ జూన్ 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓఎంఆర్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్థులను ఎవరినీ అనుమతించబోమని కమిషన్ స్పష్టం చేసింది. 


తెలంగాణలో 503 పోస్టులతో తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను గతేడాది ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా 2,85,916 మంది రాశారు. ఇక ప్రిలిమ్స్ కీలో వెలువడిన అభ్యంతరాల నేపథ్యంలో 5 ప్రశ్నలు తొలగించి కమిషన్ తుది కీ ఖరారు చేసింది.


పరీక్ష రాసిన వారిలో 1:50 నిష్పత్తిలో 25 వేల మంది అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ మెయిన్స్‌కు ఎంపిక చేసింది. వారికి షెడ్యూలు ప్రకారం జూన్‌లో ప్రధాన పరీక్షలు జరగాల్సి ఉంది. ఇంతలోనే ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వెలుగుచూడడంతో గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష రద్దు చేసి మళ్లీ రీషెడ్యూల్ చేసి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 


టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకారం జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులకు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, బయోమెట్రిక్ ధ్రువీకరణ తర్వాతే అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. 


గ్రూప్-1 పరీక్ష విధానం, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


గ్రూప్-1 అభ్యర్థులకు సూచనలు..


➥ ఓఎంఆర్ పత్రంలో ఎవరైనా తప్పులు చేస్తే, దానికి బదులుగా కొత్తది ఇవ్వరు.


➥ ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో సక్రమంగా బబ్లింగ్ చేయాలి. 


➥ సరైన వివరాలు బబ్లింగ్ చేయని, పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్ ఉపయోగించిన, డబుల్ బబ్లింగ్ చేసిన పత్రాలు చెల్లుబాటు కావు. 


➥ అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ కార్డు/పాన్ కార్డు లేదా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపుకార్డులు తీసుకురావాలి. 


➥ ఎవరైనా అభ్యర్థులు అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి, కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తారని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. 


నిబంధనలను అతిక్రమిస్తే డీబారే..
సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఇక నుంచి ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కమిషన్ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలు రాయకుండా డిబార్ చేయాలని నిర్ణయించింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో సంబంధాలున్న 50 మందిని రెండు రోజుల వ్యవధిలో కమిషన్ డిబార్ చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రాల్లో అల్లరి చేసినా, ఎలక్ట్రానిక్ పరికరాలతో పట్టుబడినా పోలీసు కేసులతో పాటు చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...