Magunta Raghav : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన పదిహేను రోజుల మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. పన్నెండో తేదీన ఆయన సరెండర్ కావాలని ఆదేశిచింది. తన అమ్మమ్మకు ఆరోగ్యం బాగో లేదనందున బెయిల్ కావాలని రాఘవ పిటిషన్ వేశారు. ఈ మేరకు పదిహేను రోజుల మధ్యంతర బెయిల్ ను దిగువకోర్టు ఇచ్చింది. అయితే ఈడీ వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మాగుంట రాఘవ బెయిల్ పై బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని.. సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
మాగుంట రాఘవ భార్య ఆత్మహత్యాయత్నం చేశారన్న లాయర్లు
బెయిల్ రద్దుపై విచారణలో మాగుంట రాఘవ తరపు న్యాయవాది.. కీలక విషయాలు వెల్లడించారు. మాగుంట రాఘవ భార్య కూడా గతంలో ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పారు. అందువల్ల ఆమె కూడా రాఘవ అమ్మమ్మ ఆరోగ్యాన్ని చూసుకునే అవకాశం లేదన్నారు. అయితే.. గతంలో తన భార్య అనారోగ్యమని బెయిల్ పిటిషన్ వేశారని.. అక్కడ ఊరట లభించకపోయే సరికి అమ్మమ్మ అనారోగ్యం పేరుతో మరో పిటిషన్ దాఖలు చేశారని ఈడీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదించారు. ఇప్పుడు రాఘవ బెయిల్ పై విడుదలయ్యారా అని ధర్మాసనం ప్రశ్నించింది. అవునని ఆయన బెయిల్ రాగానే.. జైలు నుంచి విడుదలై.. నెల్లూరుకు వెళ్లారని లాయర్లు చెప్పారు. అందుకే పన్నెండో తేదీ లోపు సరెండ్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సౌత్ లాబీలో మాగుంట రాఘవ కీలకపాత్ర పోషించారన్న ఈడీ
మాగుంట రాఘవ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించారని ఈడీ ఆరోపిస్తోంది. బాలాజీ గ్రూపు యజమానిగా ఉన్న మాగుంట రాఘవకు... ఇండో స్పిరిట్ కంపెనీలో భాగస్వామ్యం ఉందని ఈడీ చార్జిషీట్లలో కోర్టుకి తెలిపింది. రాఘవరెడ్డిని ఈ కేసులో కీలక వ్యక్తిగా ఈడీ చూపించింది. 180 కోట్ల నేరపూరిత ఆర్ధిక లావాదేవీల్లో రాఘవరెడ్డి పాత్ర ఉందని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్ కంపెనీలో రాఘవరెడ్డిని భాగస్వామిగా చూపించింది. మరోవైపు మాగుంట ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రెండు రిటైల్ జోన్స్ కూడా ఉన్నాయని ఈడీ ప్రకటించింది.
రూ. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కీలక పాత్ర
మద్యం విధానంతో లబ్ది పొందేందుకు ముడుపులు ఇచ్చారని... ముడుపులను హవాలా మార్గంలో చెల్లించారని తెలిపింది. ఇప్పటికే దాఖలు చేసిన చార్జ్ షీట్లలో వివరాలు పొందుపరచామని పేర్కొంది. సుమారు 30 మంది సాక్షుల వాంగ్మూలం కూడా నమోదు చేశామని వివరించింది. ఇండో స్పిరిట్ కంపెనీ నుంచి రాఘవ మాగుంటకు వాటా వెళ్తోందని ఈడీ చార్జిషీట్లో పెర్కొంది.
కేజ్రీవాల్ నూ ఓ సారి ప్రశ్నించిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పేరిట చక్రం తిప్పడంలో పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారని, వ్యాపార ప్రయోజనాలు పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జీషీట్లలో పలువురి పేర్లను ప్రధానంగా ప్రస్తావించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఓ సారి ప్రశ్నించారు. పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం గురించి ఈడీ పలుమార్లు విచారణ జరిపింది.