వారాల వ్యవధిలోనే టీడీపీకి రెండోసారి సన్ స్ట్రోక్ తగిలింది. మొన్నటికి మొన్న కోడెల శివప్రసాద్ కుమారుడు షాక్ ఇస్తే.. ఇప్పుడు బొజ్జల తనయుడు సైకిల్‌ను షేక్ చేశారు. దీంతో టీడీపీ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.
తిరుపతి జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పార్టీ చేరుతున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. చివరకు డేట్ ఫిక్స్ అయింది. గురువారం సాయంత్రం చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు ప్లాన్ చేసుకున్నారు. నాయుడు అనుచరులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. చలో అమరావతి అంటూ హోర్డింగ్స్, కార్లు హంగామా మామూలుగా లేదు. శ్రీకాళహస్తి నుంచి బయల్దేరడమే ఆలస్యం అనుకున్నారంతా కానీ టీడీపీ నుంచి నాయుడికి ఫోన్ వెళ్లింది. ఇవాళ జాయినింగ్ వీలుపడదని తర్వాత డేట్ చేప్తామన్నారు.
కట్ చేస్తే టీడీపీ లీడర్, బొజ్జల తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి విడుదల చేసిన వాయిస్ మెసేజ్ కాక రేపింది. నాయుడి సైకిల్ ఎక్కుదామన్న ఉత్సాహానికి గాలి తీసింది. దీంతో చంద్రబాబు తన ప్లాన్ మార్చేశారు. 14వ తేదీని ఇద్దరూ కుప్పం రావాలని ఆదేశించారు.
ఎస్సీవీ నాయుడి జాయినింగ్ గురించి తనకు తెలియదని... పార్టీ లీడర్లు కేడర్ ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదని శ్రీకాళహస్తి టీడీపీ ఇన్‌చార్జ్‌గా సుధీర్ రెడ్డి కేడర్ సందేశం పంపించారు. అది అలా వైరల్ అవుతూ టీడీపీ అధినాయకత్వానికి చేరింది. దీంతో ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. ముందు బొజ్జల సుధీర్ రెడ్డితో మాట్లాడి పరిస్థితి చక్క దిద్దిన తర్వాత జాయినింగ్స్ పెట్టుకుంటే మంచిదని టీడీపీ భావిస్తోంది.
ఇప్పటికే సత్తెనపల్లి ఇన్‌ఛార్జ్‌గా కన్నాను నియమించడంతో కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ ఆగ్రహంతో ఉన్నారు. తనకు చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని బహిరంగంగానే స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో టీడీపీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగింది.