Adilabad Latest News: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో వివాదాస్పదంగా ఉన్న 12 గ్రామాల అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ముంబయిలో బుధవారం జరిగిన అధికారుల అత్యున్నతస్థాయి సమావేశంలో వివాదాస్పద గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది.
భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా పూర్వ ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా) కెరమెరి మండల పరిధిలోకి కొన్ని గ్రామాలను చేర్చారు. అలా చేసిన గ్రామాలు ఇవే పరందోలి, ముకద్దంగూడ, మహారాజ్ గూడ, కోట, అంతాపూర్, ఇంద్రానగర్, ఏసాపూర్, నారాయణగూడ, బోలాపటార్, గౌరీ, లెండిగూడ, పద్మావతి. అయితే భౌగోళికంగా, సాంస్కృతికంగా తమకు అనుకూలంగా ఉందనే కారణంతో 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం ఇవే గ్రామాలను చంద్రపూర్ జిల్లా జివితి తాలూకాలో చేర్చింది. ఇక్కడే వివాదం ప్రారంభమైంది.
1987 నుంచి ఈ గ్రామాల్లో ఇరు ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఈ గ్రామాలకు ఇద్దరేసి సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రుల ప్రాతినిధ్యం కొనసాగుతోంది. దీంతోపాటు ఈ గ్రామాల ఓటర్లు రెండు రాష్ట్రాల్లో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకుంటారు. రాష్ట్రవివాదం పరిష్కారం కోసం అప్పట్లోనే రెండు ప్రభుత్వాలు కలిసి వేసిన కేకే నాయుడు కమిషన్ సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోనివే అని చెప్పింది.
కేకే నాయుడు కమిషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు మరోసారి ఆ గ్రామాలు అంశాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. అవి తమ పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. దీంతో అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది.
సీఎం ఫడణవీస్ నిర్ణయాన్ని శివసేన (ఉద్ధవాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ స్వాగతించారు. కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న 672 గ్రామాల విషయంలోనూ మహారాష్ట్రలోకి తీసుకోవటానికి సీఎం ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో భాజపా ఎంపీ గోడం నగేష్ ప్రాతినిథ్యం ఉండగా, మహారాష్ట్ర, కేంద్రంలో భాజపా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నందున సీఎం వ్యాఖ్యల వెనక మర్మమేంటనే ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందనేది వెల్లడికావాల్సి ఉంది.