Civils Results 2022: సివిల్స్ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా వాసులు అత్యుత్తమ ప్రతిభ చాటారు. సివిల్స్ ఫలితాల్లో జిల్లాకు చెందిన బోధన్ వాసి కంఠం మహేష్ కుమార్ ఆల్ ఇండియా స్థాయిలో 200 ర్యాంకు సాధించారు. నిజామాబాద్ నగరానికి చెందిన దీప్తి చౌహాన్ ఆల్ ఇండియా 630వ ర్యాంకు సాధించారు. కంఠం మహేష్ కుమార్ ఆరో ప్రయత్నంలో ఉత్తమ ర్యాంకు సాధించగా దీప్తిచౌహాన్ మూడో ప్రయత్నంలో 630 ర్యాంకు సాధించారు. 


ఆరో ప్రయత్నంలో మహేష్, మూడో ప్రయత్నంలో దీప్తి..


బోధన్ పట్టణానికి చెందిన కంఠం మహేష్ కుమార్ పట్టువదలని విక్రమార్కుడిలా ఆరో ప్రయత్నంలో విజయవంతం అయ్యారు. ఐఏఎస్ కావడమే లక్ష్యంగా ముందుకుసాగాడు. తండ్రి రాములు ఎన్పీడీసీఎల్లో సీనియర్ లైన్ మెన్ గా పని చేస్తుండగా తల్లి యాదమ్మ ఇంటి వద్దే ఉండి పనులు చూసుకునేది. మహేష్ కుమార్  పిట్లం బ్లూ బెల్స్ మోడల్ స్కూల్లో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివాడు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నిజాంసాగర్ నవోదయలో చదివాడు. ఇంటర్ జిల్లా కేంద్రంలోని శాంకరి కళాశాలలో, డిగ్రీ నిజాం కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, పీజీ జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ.... ఢిల్లీలో పొలిటికల్ సైన్స్, పీహెచ్‌డీ ఢిల్లీ యూనివర్సిటీలో చైనీస్ లాంగ్వేజ్ చేశాడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉన్న మహేష్ కుమార్ ఆరో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం వివాహం కాగా ఆయన భార్య సాయి సౌమ్య సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


దీప్తి చౌహాన్ కు 630వ ర్యాంకు..


నిజామాబాద్ జిల్లాలో తహసీల్దార్ గా పని చేసి ఆర్డీవోగా రిటైర్ అయిన వెంకటయ్య కోడలు సబావత్ దీప్తి చౌహాన్ సివిల్స్ 630 ర్యాంకు సాధించింది. నాగర్ కర్నూల్ కు చెందిన దీప్తి.. వెంక టయ్య కుమారుడు డాక్టర్ ప్రవీణ్ ను వివాహం చేసుకుంది. మూడో ప్రయత్నంలో దీప్తి ఈ ర్యాంకు సాధిoచారు. దీప్తి తల్లి చంద్రకళ టీచర్ గా, తండ్రి కిషన్ లాల్ బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్నారు. పదో తరగతి వరకు మహబూబ్ నగర్ లో చదివిన దీప్తి ఇంటర్ హైదరాబాద్ శ్రీ చైతన్యలో చదివింది. ఎంబీబీఎస్ సీటు సాధించి ఆదిలాబాద్ రిమ్స్ ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఢిల్లీలోని వాజీరామ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుని సివిల్స్ ర్యాంకు సాధించారు. భర్త ప్రవీణ్ హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఎండీగా పని చేస్తున్నారు.


జిల్లాకు చెందిన ఇద్దరు సివిల్స్ లో ర్యాంకు సాధించడంతో అంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు ఒకేసారి సివిల్స్ లో ర్యాంకులు సాధించి జిల్లా పరువు నిలబెట్టారంటూ చెబుతున్నారు. వీరిద్దరికీ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు కూడా అభినందనలు చెబుతున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అంటూ చెప్పుకొస్తున్నారు.