CPI Narayana Call Recording Over Chennur Ticket:
ఎన్నికలు అనగానే ప్రత్యర్థి పార్టీల నేతలతోనే కాదు సొంత పార్టీలోనూ విభేదాలు బయట పడతాయి. కొందరు నేతల కామెంట్స్ అభ్యర్థులను, పార్టీ అధిష్టానాన్ని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. వేరే పార్టీ నేతలకు ఫోన్ చేసి తమకు మద్దతు ఇవ్వాలని పార్టీ పెద్దలకు తెలియకుండా బేరసారాలు కూడా జరగడం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు మునుగోడ ఉప ఎన్నికల సమయంలో బయటపడటం చూశాం. తాజాగా ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ కు అమ్ముడుపోయారా అని ఒకరు సీపీఐ నేత నారాయణకు కాల్ చేసి మాట్లాడినట్లుగా ఉన్న కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆడియో కాల్ రికార్డింగ్ లో ఏముందంటే..
ఓ వ్యక్తి సీపీఐ నారాయణకు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. తాను చెన్నూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫయాజ్ అని చెప్పారు. మీరు ఉద్యమకారులు, మీరంటే గౌరవం ఉంది సార్ అని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులతో కలిసి బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా చెన్నూరు నియోజకవర్గం సీపీఐ తీసుకుంటుందని తెలిసిందని ఆ వ్యక్తి అన్నారు. చెన్నూరులో సీపీఐ పోటీ అంటే బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఓడిపోవడమే. చెన్నూరులో బాల్క సుమన్ విజయం సాధిస్తారు, కనుక మీరు ఓడిపోయే చోట ఎందుకు సీటు తీసుకుంటున్నారని నారాయణను కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. మీరు వస్తే బాల్క సుమన్ ను గెలిపించుకునేందుకు మా చెన్నూరుకు వచ్చినట్లేనని, మీరు గెలిచే చోట పోటీ చేయాలని, కోట్లాడాలని కోరారు. ఆ విషయం నీకు ఎందుకంటూ నారాయణ ఆ వ్యక్తిపై మండిపడ్డారు.
మీరు బీఆర్ఎస్ కు, బాల్క సుమన్ కు అమ్ముడు పోయినట్లే కదా, ఆయనతో కుమ్మక్కయ్యారా అంటూ నేరుగా నారాయణను ఆ వ్యక్తి ప్రశ్నించారు. నువ్వు కాంగ్రెస్ పార్టీ అయితే, పార్టీ నేతలతో దీనిపై మాట్లాడాలని తనకు ఫోన్ చేసి ఎందుకు అడుగుతున్నారు అని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కాదు, నువ్వు, మీ నాయన అమ్ముడుపోయారంటూ ఆ వ్యక్తిపై సీపీఐ నారాయణ ఎదురుదాడికి దిగారు. కావాలంటే గెలిచే చోట సీటు దక్కించుకుని పోటీ చేయాలని, కానీ ఈ విధంగా మాట్లాడుతూ.. ఇలాంటి పనులు చేస్తే గౌరవం ఉండదని ఆ వ్యక్తి అన్నారు. ఇందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. నిజంగానే చెన్నూరు సీటు సీపీఐకి కేటాయిస్తున్నారని, అక్కడ ఓటమి ఖాయమని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో 2 పేర్లు ఖరారు చేసింది. బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్, మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు పోటీ చేయనున్నారు. చెన్నూరు సీటును ఎవరికి ఇవ్వలేదు. మరోవైపు కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా కొత్తగూడెం, చెన్నూరు సీట్లను సీపీఐకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. చెన్నూరులో బాల్క సుమన్ ను సీపీఐ ఓడించే ప్రసక్తే లేదని, ఆ సీటు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఇవ్వాలని కొందరు నిరసన వ్యక్తం చేశారు. రెండు రోజుల కిందట రామకృష్ణాపూర్ లోని రాజీవ్ చౌక్ వద్ద కళ్లకు గంతలు కట్టుకుని ఆ సీటును సీపీఐకి ఇవ్వవద్దని నిరసన తెలిపారు. చెన్నూరు సీటును పొత్తులో భాగంగా సీపీఐకి కనుక ఇస్తే మూకుమ్మడి రాజీనామాలు తప్పవని క్యాడర్ పార్టీ పెద్దలకు ఇదివరకే తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసింది.