Telangana News: కొందరి గాథలు వింటే తెలియకుండానే కళ్లవెంబడి నీళ్లు కారుతాయి. అలాంటి విచిత్రమైన స్టోరీ ఇది. మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామానికి చెందిన ఓ కుటుంబ విషాథ గాథ. మొండయ్య దంపతులకు నలుగురు సంతానం. ఇందులో ఒకడే జీవన్ కుమార్. ఐటీఐ పూర్తి చేశాడు. ఉద్యోగాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అన్ని చోట్ల నిరాశ ఎదురైంది. 2018లో వేసిన నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్‌లో జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టులకి దరఖాస్తు చేసుకున్నాడు. ఈసారి కచ్చితంగా జాబ్ వస్తుందని నమ్మాడు. కానీ రాలేదు. అదే మనోవ్యధతో 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఉద్యోగానికి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్‌కు హాజరుకావాలని జీవన్‌కు కాల్‌లెటర్ వచ్చింది. ఇది తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్లంతా కంటతడి పెట్టుకున్నారు. 
అసలేం జరిగింది


నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్‌లో జూనియర్‌ లైన్‌మన్‌ ఉద్యోగాల భర్తీలో మొదట్లో రాత పరీక్ష మెరిట్ ఆధారంగా అభ్యర్థులను పిలిచారు. అందులో చాలా అందికి ఉద్యోగానికి అర్హత లేదని కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఇప్పుడు అలా ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు మరోసారి మెరిట్‌ లిస్ట్ ప్రిపేర్ చేసి ఫైనల్ ఎగ్జామ్‌ అంటే స్తంభాలు ఎక్కే పరీక్షలు పిలిచారు. అలాంటి రెండోసారి ప్రిపేర్ చేసిన మెరిట్ లిస్ట్‌లో జీవన్ కుమార్ పేరు ఉంది. 


ఆ మొండయ్య కుటుంబంలో ఒక్క జీవన్ కుమార్‌ మాత్రమే కాదు ఫ్యామీల అంతా చనిపోయింది. ఒక్క పెద్ద కుమారుడు నవీన్ కుమార్ మాత్రమే మిగిలాడు. మొండయ్యకు పుట్టిన నలుగురు సంతానంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్లు మానసిక వికలాంగులు. ఇందులో ఒక బిడ్డ 2018లోని చనిపోయింది. ఆ బెంగతో మొండయ్య భార్య 2019లో కన్నుమూసింది. ఉద్యోగం రాలేదని 2020లో జీవన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత ఏడాది గ్యాప్‌లో మొండయ్య, రెండో కుమార్తె కూడా చనిపోయారు. ఇప్పుడు మిగిలింది ఒక్క నవీన్ కుమార్‌ మాత్రమే. 


ఉద్యోగం కోసం ప్రయత్నించి ప్రాణాలు తీసుకున్న జవన్‌కు నాలుగేళ్ల తర్వాత చివరి పరీక్ష కోసం కాల్ లెటర్ వచ్చింది. ఈ నెల 24న పరీక్షకు హాజరుకావాలని అందులో ఉంది. అయితే జీవన్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న పోస్టుమాస్టార్ ఆ కాల్‌లెటర్‌ను తిరిగి తీసుకెళ్లిపోయారు.