RS Praveen Kumar: తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలకు వరదల్లో చిక్కి ప్రజలు చనిపోతుంటే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు లేనిదే మంత్రులు,అధికార యంత్రాంగం బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములుగు, ఏటూరునాగారం, వరంగల్ ప్రాంతాల్లో వరదలతో సర్వం కోల్పోయిన కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి, ఇండ్లు నిర్మించాలన్నారు. 


గత ఏడాది గోదావరి కరకట్టలకు రూ.1,000 కోట్ల కేటాయిస్తారని ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్ కనీసం ఒక్క కోటి రూపాయలు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. గోదావరి వరదల్లో ప్రజలు చనిపోతుంటే కేసీఆర్ ఎక్కడని ప్రశ్నించారు. కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే రూ.1400 కోట్లతో కొత్త సెక్రటేరియేట్ నిర్మించుకొన్నారన్న ఆయన మారుమూల ప్రాంతాల్లో రోడ్లు నిర్మించలేదన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక దిగుతున్న 1000 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. దళిత బంధు,చేతి,కుల వృత్తుల బంధు ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. గజ్వేల్ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి బంధు ప్రకటించాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 
కేసీఆర్ చేతకానితనం..!
ప్రభుత్వ పాఠశాలలకు రాజకీయ నాయకులు, మీడియాను అనుమతించవద్దని ప్రభుత్వం సర్క్యులర్ ఇవ్వడం కేసీఆర్ చేతకానితనంగా పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ఎక్కడైనా తిరుగవచ్చన్న ఆయన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకే రాష్ట్రంలో తిరిగి హక్కు లేదన్నారు. మణిపూర్ లో జరిగిన మరణహోమాలపై ప్రధాని మౌనంగా ఉండడం దేనికి సాంకేతమన్నారు. బీజేపీ పాలనలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో ఆదివాసులు, ఎస్సీ,మైనారిటీలపై దాడులు జరుగుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫాసిస్ట్ బిజేపీని ఓడించి, దేశం నుండి బయటకు పంపించాలన్నారు. 


కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు ఒర్రె బ్రిడ్జి నిర్మించి అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడంతో గ్రామాలకు వెళ్లాలంటే ప్రజలు అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దిందా వాగుపై వంతెన నిర్మించకపోవడంతో పాఠశాలకు వెళ్లలేదని టీచర్లు చెబితే ఎమ్మెల్యే ఒత్తిడితో కలెక్టర్ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు. మిషన్ భగీరథకు 36 వేల కోట్లు కేటాయించినా బెజ్జూర్ ప్రాంతంలో తాగునీరు కోసం వాగు చెలిమల్లో నీళ్లు తోడుకుంటున్నారని చెప్పారు. ప్రాజెక్టులకు మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. ఎమ్మెల్యే కోనప్ప అండతో బెజ్జూర్ ఇన్చార్జ్ సర్పంచ్ గ్రామ పంచాయతీలో రూ 6 లక్షల అభివృద్ధి పనులు చేసి, రూ.12 లక్షల నిధులు డ్రా చేశారన్నారు. అవినీతి, అక్రమాలకు సహకరించిన పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


ఎమ్మెల్యే కోనప్ప అక్రమాలు, అవినీతిపై త్వరలోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా సానికేతరులకు అధిక వేతనాలు చెల్లించి ఉద్యోగాలు కల్పిస్తున్నారని విమర్శించారు. జెకె పేపర్ మిల్ యాజమాన్యం అక్రమాలపై త్వరలోనే కార్మికులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామన్నారు. బిఎస్పీ గెలిచిన వెంటనే ప్రెస్ క్లబ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వరదల్లో చిక్కుకొన్న వారికి పార్టీ శ్రేణులు సహాయక చర్యలో పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.