బాసరలోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (RGUKT) విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రాత్రి వేళ కూడా చివరికి వర్షంలోనూ వారి ఆందోళన కొనసాగింది. తమ విద్యాసంస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అవి నెరవేరే వరకూ తాము వెనక్కి తగ్గేది లేదని వారు తెగేసి చెబుతున్నారు. తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆగ్రహించారు. తమవి సిల్లీ డిమాండ్లు అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొనడం దారుణమని అన్నారు. 


‘‘హైదరాబాద్‌లో ఉండి మాట్లాడటం కాదు. ఇక్కడికి వచ్చి చూడాలి’’ అంటూ ధ్వజమెత్తారు. అంతేకాక, జిల్లా కలెక్టర్ తమతో వ్యవహరించిన తీరు బాగోలేదని, చర్చలకు పిలిచి బెదిరించారని విద్యార్థులు ఆరోపించారు. నిర్మల్‌ కలెక్టర్‌ ముషరఫ్‌ అలీ బుధవారం రాత్రి కొందరు విద్యార్థులతో చర్చలు జరిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు. ప్రస్తుతం విద్యార్థులు చెబుతున్న 12 డిమాండ్లలో రెండు, మూడు మాత్రం వెంటనే పరిష్కారం చేస్తామని, మిగితావి ఇప్పట్లో చేయలేమని అన్నారు. దానికి విద్యార్థులు ఒప్పుకోలేదు. తమ అన్ని డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని, తెగేసి చెప్పారు. ముఖ్యమంత్రి లేదా మంత్రి కేటీఆర్‌ వచ్చేదాకా తాము వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.


‘‘మా సమస్యలు సిల్లీ అనుకుంటున్నారా? మేం 8 వేల మంది యువత క్యాంపస్‌లో ఉన్నాం. ఇంకా మరో 9 వేల మంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 14 వేల మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.’’ అని విద్యార్థులు ట్వీట్ చేశారు.






‘‘మేము ఎవరిని కొట్టట్లేదు, శాంతియుతంగా మా సమస్యలను చెప్తున్నాం. సరైన అధికారి రాకను డిమాండ్  చేస్తున్నాం. ఇందులో ఎటువంటి రాజకీయ ప్రోద్బలం లేదు. విద్యార్థుల చైతన్యం, ఆత్మస్థైర్యాలే మా ఆయుధాలు. ఇక్కడ గాయలయ్యేది శరీరాలకు కాదు. అధికార దర్పానికి, పాలకవర్గ అలసత్వానికే గాయాలయ్యేది’’ అని విద్యార్థఉలు ట్వీట్ చేశారు.


‘‘మేము ఆత్మహత్యలు చేసుకోవట్లేదు. ఆలోచన మా చెంతనుండగా ఆత్మహత్యలు, ఆత్మాహుతులెందుకు దండగ! - విద్యార్థి పరిపాలక మండలి - ఆర్జీయూకేటీ బాసర’’ అని మరో విద్యార్థి ట్వీట్ చేశారు.