Banswada News: దొంగతనం చేసిన తర్వాత దరిదాపుల్లో లేకుండా పారిపోతారు దొంగలు. అందినకాడికి దోచుకుని ఎవరి కంట పడకుండా జారుకుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా పరారవుతారు. కానీ... ఓ దొంగ మాత్రం ఇంటిని దోచుకుని ఊరి నుంచి వెళ్లిపోకుండా తాపీగా నిద్రపోయాడు. చెట్టు కింద పడుకుని గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కట్ చేస్తే... గ్రామస్తులకు పట్టుబడ్డాడు. వింతగా ఉంది కదూ. ఈ సంఘటన బాన్సువాడలో జరిగింది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ (Banswada) మండలం బోర్లంక్యాంపు గ్రామానికి చెందిన కుర్మ రాజు దంపతులు... ఈనెల 17న (ఆదివారం) ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ముందే గమనించి పెట్టుకున్నాడో... లేక... తాళం వేసి ఉండటం చూసి వచ్చాడో ఏమో గానీ... కుర్మరాజు ఇంటిపై కన్నేశాడు తాడ్వాయి మండలం కనకల్ గ్రామానికి చెందిన బత్తుల మోహన్. తాళం వేసి ఉన్న ఆ ఇంట్లోకి అర్థరాత్రి సమయంలో చొరబడ్డాడు. బీరువాను ధ్వంసం చేశారు. అందులోని ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. ఆ తర్వత నెమ్మదిగా ఆ ఇంటి నుంచి బయటపడ్డారు. ఇంత వరకు బాగానే ఉన్నా... ఆ తర్వాతే ట్విస్ట్ మొదలైంది.
దొంగతనానికి పాల్పడి తర్వాత.. ఊరు వదిలి వెళ్లిపోకుండా... నిద్రలోకి జారుకున్నాడు ఆ దొంగ. నిద్రమేలుకుని అర్థరాత్రి వరకు కష్టపడి దొంగతనం చేశాడనో ఏమో.. ఆ దొంగకు నిద్ర ముంచుకొచ్చింది. దీంతో మార్గ మధ్యలో ఓ చెట్టు చూసుకుని... దాని కింద నిద్రపోయాడు. గాఢ నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారిపోయినా సరే నిద్రపోతూనే ఉన్నాడు.
ఇక.. ఇంతలో కూర్మరాజు ఉదయం 5గంటలకు ఇంటికి తిరిగివచ్చాడు. ఇంటి తాళాలు పగులకొట్టి ఉండటం చూశాడు. బీరువా ధ్వంసం చేసి ఉండటం చూసి బెంబేలెత్తిపోయాడు. అందులోని నగలు లేకపోవడంతో... వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అతని ఇంటిని చేరుకుని... మొత్తం పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకుని వెళ్లిపోయారు.
ఇందంతా జరుగుతూనే ఉంది... కూర్మరాజు ఇంట్లో దొంగతనం చేసిన దొంగ బత్తుల మోహన్ మాత్రం ఇంకా చెట్టుకింద నిద్రపోతూనే ఉన్నాడు. ఉదయం 6గంటల సమయంలో గ్రామానికి చెందిన కొందరు యువకులు వాకింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో చెట్టు కింద నిద్ర పోతున్న దొంగను చూశాడు. అతన్ని చూడగానే ఎందుకు అనుమానాస్పదంగా అనిపించాడు వాళ్లకి. దీంతో అతన్ని నిద్రలేని వివరాలు అడిగారు. అతను చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో... తనిఖీ చేశారు. అతని దగ్గర చోరీకి గురైన ఆరు తులాల బంగారం కనిపించడంతో.. అతనే దొంగ అని నిర్ధారించి పట్టుకున్నారు. వెంటనే బత్తుల మోహన్‌ను పోలీసులకు అప్పగించారు. దొంగిలించిన ఆరు తులాల బంగారు ఆభరణాలు దొరకడంతో... కూర్మరాజు కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక... పోలీసులు దొంగ అయిన బత్తుల మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఇంకా ఎంతమంది ఇళ్లలో ఇలా దొంగతనం చేశాడో ఆరా తీస్తున్నారు. ఇది... దొంగతనం తర్వాత నిద్రలోకి జారుకున్న ఆ దొంగ కథ.