Bandi Sanjay sensational comments on Ramji Gond memorial Veyyi Urula Marri: నిర్మల్: వెయ్యి ఉరుల మర్రి వద్ద కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంజీ గోండు స్మారక ప్రాంతాన్ని ఒక వర్గం వారి సమాధికి కేటాయిస్తారా? ఒక వర్గం ఓట్ల కోసం ఆదివాసీల చరిత్రను తెరమరుగు చేసే కుట్ర చేస్తారా? అని ప్రశ్నించారు. చరిత్రను తెరమరగు చేయాలనుకున్న బీఆర్ఎస్ సర్కార్ నే కనుమరుగు చేసిన చరిత్ర ప్రజలది అన్నారు. నిర్మల్ లో వెయ్యి ఉరుల మర్రి వద్ద రాంజీ గోండు స్మృతి కేంద్రానికి బుధవారం బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు వెయ్యి ఉరుల మర్రి వద్ద అమరవీరులకు ఎంపీ బండి సంజయ్‌, బీజేపీ నేతలు నివాళులర్పించారు.


సమాధికి కేటాయించడం దారుణం 
అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. రాంజీ గోండు స్మారక ప్రాంతాన్ని ఒక వర్గం వారి సమాధికి కేటాయించడం దారుణం అన్నారు. వెయ్యి ఉరుల మర్రి స్మారక ప్రాంతాన్ని మరో చోటుకు మార్చాలనుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఎక్కడ వెయ్యి ఉరుల మర్రి ఉందో అక్కడే రాంజీ స్పూర్తి కేంద్రం ఏర్పాటుకు బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎంపీ బాపూరావుతో కలిసి బండి సంజయ్ భూమి పూజ చేశారు. వచ్చే ఏడాది నాటికి ఈ ప్రాంతాన్ని రాంజీగోండు స్పూర్తి కేంద్రంగా మారుస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్.


రాంజీగోండు స్మారక చిహ్న ప్రాంతాన్ని వివాదాస్పదం చేస్తే ఖబడ్దార్ అని బండి సంజయ్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నేతల్లారా.. వెయ్యి ఊడల మర్రి చరిత్రను మతం కోణంలో చూస్తుంటే మౌనం వహిస్తారా? అని బండి సంజయ్ నిలదీశారు. దీనిని వివాదాస్పదం చేస్తే అది కాంగ్రెస్ కే నష్టం అని అభిప్రాయపడ్డారు. ఓట్ల కోసం వివాదాస్పదం చేయాలనుకుంటే బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ చరిత్ర కూడా తెరమరుగు కాక తప్పదు అని హెచ్చరించారు. 


నిర్మల్‌లో బీజేపీ విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిందని తెలిసిందే. ఈ యాత్రలో ఎంపీ బండి సంజయ్‌, మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. కేంద్రం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గత పదేళ్లలో మోదీ సర్కార్ సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా యాత్ర కొనసాగనుంది.