Nizamabad News: ఒకప్పుడు రాజులు.. ఆ తర్వాత గ్రామంలోని పెద్ద కులస్తులు, ఆ తర్వాత వీడీసీలు.. ఇలా ఒకరు పోతే ఒకరు వస్తూ గ్రామ ప్రజలకు తీర్పులిస్తున్నారు. చెప్పినట్టు వినకపోతే కుల బహిష్కరణలు, సామాజిక బహిష్కరణ, గ్రామ బహిష్కరణలు చేస్తూ తమ ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు కూడా ఊళ్లో ఎవరూ మాట్లాడరనే ఉద్దేశంతో వారు చెప్పినట్లుగా చేయడం, జరిమానాలు కట్టడం వంటివి చేస్తున్నారు. ఇంతటి సాంకేతిక యుగంలోనూ... న్యాయాలు, చట్టాలను కాదని తాము చెప్పిందే వేదమని రెచ్చిపోతున్నాయ్ గ్రామాభివృద్ధి కమిటీలు. ఒకప్పుడు గ్రామాభివృద్ధి కోసం వి.డి.సి(విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ)లు ఏర్పడ్డాయి. నాడు మంచి ఉద్దేశంతో ఏర్పడ్డ కమిటీలు రాను రాను రాచరికపు పోకడలకు పోతున్నాయి. న్యాయ వ్యవస్థలు, చట్టాలను కాదని వారు ఇచ్చిన తీర్పే వేదమని శాసిస్తున్నారు. 


200 మంది బీడీ కార్మికుల ఉపాధికి అడ్డుకట్ట వేసిన వి.డి.సి


నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ఆర్మూర్ నియోజక వర్గాల్లో వీడీసీల ఆగడాలు ఎక్కువ అయ్యాయి. కమ్మర్ పల్లి మండలం అసకొత్తూర్‌లో గ్రామాభివృద్ధి కమిటీ 200 మంది బీడీ కార్మికుల ఉపాధికి గండి కొట్టింది. గ్రామంలో బీడీలు చుట్టొద్దని ఆంక్షలు విధించింది. వారికి గ్రామంలోని బ్యాంకులో లావాదేవీలు నడపకూడదని, బీడీ కమిషన్ దారులు గ్రామంలో బీడీలు కొనవద్దని, బీడీ ఆకులు, తంబాకు అమ్మకూడదని గ్రామాభివృద్ధి కమిటీ హుకుం జారీ చేసింది. అలా చేసిన వారికి 10 వేల రూపాయలు జరిమానా విధించింది. దీంతో గ్రామంలోని 200 మందికి పైగా బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. బీడీలు చుట్టి తమ పిల్లలను చదివిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారికి జీవనం లేకుండా వీడీసీ అన్యాయం చేస్తోందని బీడీ కార్మికులు మండిపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని బీడీ కార్మికులు పోలీసులను ఆశ్రయించారు. వామపక్షాలు వారికి మద్దతుగా నిలిచాయి. 


81 మంది గౌడ కులస్తుల గ్రామ బహిష్కరణ


జక్రాన్ పల్లి మండల కేంద్రంలో 81 మంది గౌడ కులస్తులను గ్రామాభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేసింది. గ్రామాభివృద్ధి కమిటీ అడిగినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. గౌడ కులస్తులు అంత డబ్బు ఇవ్వటం కుదరదని చెప్పటంతో వారి కుల వృత్తిపై ఆంక్షలు విధించింది. గత 10 రోజులుగా వారు వృత్తికి దూరంగా ఉంటున్నారు. వారికి గ్రామంలో ఎలాంటి సహకారం అందించవద్దని వీడీసీ తీర్పు చెప్పింది. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఆంక్షలు విధించింది. దీంతో గౌడ కులస్తులు న్యాయ పోరాటానికి దిగారు. వీడీసీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఇలా కొన్నేళ్ల నుంచి బాల్కొండ, ఆర్ముర్ నియోజక వర్గాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు శృతి మించి పోతున్నాయి. రాజకీయ నాయకులు సైతం వీరికి భయపడాల్సి వస్తోంది. గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలు, పోలీసులు ఉన్నా.... వీడీసీ చెప్పిందే వేదంగా మారింది. ఇకనైనా ఇలాంటి రాచరిక ధోరణికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు ఆయా గ్రామాల ప్రజలు.