Asifabad News: పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంటి ముందు పందిరి వేశారు. పెళ్లి కొడుకును కూడా చేశారు. హల్దీ, మెహందీ ఇలా అన్ని ఫంక్షన్లను ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఇక ఓ అమ్మాయ మెడలో తాళి కట్టి.. మరో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు. కానీ అంతలోనే ఆ కలలన్నీ కల్లలుగా మారాయి. తెల్లారితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయి పాడె మీదకు ఎక్కాడు. 


అసలేం జరిగిందంటే?


కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుడ్లబొరీ గ్రామానికి చెందిన తిరుపతి అనే యువకుడికి పెళ్లి ఫిక్స్ చేశారు. జూన్ 14వ తేదీన ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మరికొన్ని గంటల్లోనే పెళ్లి జరగబోతుందని అనుకుంటుండగా.. ఇంతలోనే అనుకోని విషాదం జరిగింది. పెళ్లి కొడుకుకు వడదెబ్బ తగిలింది. ఈక్రమంలోనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు. అయితే వాంతులు, విరేచనాలతో తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డాడు. మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ పెళ్లి కుమారుడు చనిపోయాడు. దీంతో ఆ ఇంటా విషాదం నెలకొంది.


వడ దెబ్బ తగిలిన వెంటనే ఇలా చేస్తే ప్రాణాలు దక్కుతాయి: 


రోడ్డు పక్కన ఎవరైనా వడ దెబ్బతో పడిపోయినా, లేదా మీకే వడ దెబ్బ తగిలినట్లుగా సందేహం కలిగిన తప్పకుండా ప్రథమ చికిత్స అవసరం. వీలైతే ఇతరుల సాయం తీసుకునైనా ఇక్కడ చెప్పినట్లు చేయండి. 
☀ ఎవరైనా వడదెబ్బకు గురై పడిపోయినట్లయితే అంబులెన్స్‌కు కాల్ చేయాలి. 
☀ అంబులెన్స్ వచ్చేలోపు మీరు బాధితుడిని చల్లగా ఉండే ప్రదేశం లేదా చెట్టు నీడలోకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయాలి.
☀ అవసరమైతే బాధితుడిపై అదనగా ఏమైనా దుస్తులు ఉంటే వాటిని తొలగించి గాలి తగిలేలా చూడండి. 
☀ ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత తగ్గించడం కోసం క్లాత్‌ను చల్లని నీటితో తడిపి శరీరాన్ని తుడవండి.
☀ వడదెబ్బ వల్ల బాధితుడి శరీర ఉష్ణోగ్రత 104 Fకు చేరుకొనే అవకాశం ఉంటుంది. దాన్ని 101 F నుంచి 102 F వరకు తగ్గించాలి.
☀ థర్మామీటర్లు అందుబాటులో లేకపోయినా ప్రథమ చికిత్స చేయడానికి వెనకాడకండి.
☀ వీలైతే బాధితుడిని సమీపంలోని ఏదైనా ఆఫీస్, షాప్, ఇంట్లోకి తీసుకెళ్లి చల్లని వాతావరణంలో ఉంచండి. 
☀ ఐస్ ప్యాక్‌లు అందుబాటులో ఉంటే బాధితుడి చంకలు, గజ్జలు, మెడ, వీపు భాగాల్లో పెట్టండి. 
☀ పైన చెప్పిన శరీర భాగాల్లో రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉంటాయి. అవి చల్లబడితే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
☀ బాధితుడి షవర్ కిందకు తీసుకెళ్లి స్నానం చేయించినా పర్వాలేదు. లేదా చల్లని నీటి టబ్‌లోనైనా ముంచవచ్చు.
☀ ఆరోగ్యం, యవ్వనంగా ఉండే వ్యక్తి తీవ్ర వ్యాయామం వల్ల వడ దెబ్బకు గురైతే.. ‘ఎక్సర్షనల్ హీట్ స్ట్రోక్’ అని అంటారు. వీరికి ఐస్ బాత్‌ చేయించాలి. 
☀ వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు లేదా వ్యాయామం చేయని వ్యక్తులు, మద్యం తాగేవాళ్లు వడదెబ్బకు గురైనట్లయితే ఐస్ లేదా మంచును అస్సలు ఉపయోగించవద్దు. అలా చేస్తే చేయడం చాలా ప్రమాదకరం. వీలైనంత వరకు సాధారణ నీటితోనే వారి శరీర ఉష్ణోగ్రత తగ్గించే ప్రయత్నం చేయాలి.