తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆర్మూర్ పార్టీ ఇంఛార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాశారు. భారమైన మనసుతో, తీవ్ర నిరాశతో, అంతర్గత గ్రూపు రాజకీయాలతో విసిగిపోయి నియోజక వర్గంలో పార్టీని ముందుకు నడిపించే బాధ్యతను మోయలేక ఈ రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన లేఖలో రాశారు. 


‘‘ఆర్మూర్ ప్రాంతంలో జన్మించిన నేను ఆర్మూర్ గడ్డమీద ఆర్మూర్ కి చెందిన నాయకుడే ఎమ్మెల్యేగా ఉండాలని, మన ప్రాంతం వారు ఎమ్మెల్యేగా ఉంటే మన ప్రాంత అభివృద్ధి జరుగుతుందని 2016లో క్రియాశీల రాజకీయాలకు రావడం జరిగింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడిన నన్ను కొంతమంది రాష్ట్ర, జిల్లా బీజేపీ నాయకులు కలిసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానం మెరకు ఎన్నికల సమయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నాను. నేను పార్టీలో చేరే సమయానికి ఎన్నికలకు కేవలం ఒక నెల సమయం మాత్రమే ఉంది. ఈ నెల వ్యవధిలో ప్రతి ఊరు. ప్రతి పల్లె తిరిగి సుమారుగా 20వేల ఓట్లు సాధించడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే 18వ స్థానం. ఈ ఓటు శాతం గతంలో బీజేపీ ఆర్మూర్ లో ఎన్నడూ సాధించలేదు. మూడవ స్థానం వచ్చినప్పటికీ ఎక్కడా నిరుత్సాహపడకుండా ఎన్నికలు అయిన మరుసటి రోజు నుండి యథావిధిగా పార్టీ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యకర్తలు, నాయకుల సహాయ సహకారాలతో తెలంగాణలో ఎక్కడ లేని విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా 14 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానాన్ని, సర్పంచ్ - ఉప సర్పంచ్లను మరియు 6 కౌన్సిర్లలను గెలిపించుకోవడం జరిగింది. 


అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అధైర్య పడకుండా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గెలుపునకు కాలికి గజ్జ కట్టుకొని ప్రచారం చేసి ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సహాయ సహకారాలతో రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి 32 వేల అత్యధిక మెజారిటీని ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవితని ఓడించడంలో వ్యవహరించి అరవింద్ గారికి దేశవ్యాప్తంగా గుర్తింపు తేవడంలో నా పాత్ర కీలకమైనది.


అలాగే 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా జీడిమెట్ల డివిజన్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నాడని తెలుసుకొని బీజేపీ జిల్లా నాయకత్వం ఆ ఎన్నికల్లో నాకు బాధ్యతలు ఇవ్వకుండా రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించి ఆ డివిజన్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ బాధ్యతలు తీసుకున్న అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుగుతున్న నాపై స్థానిక ఎమ్మెల్యే కెపి వివేకానంద ప్రత్యక్షంగా భౌతిక దాడికి దిగినప్పటికీ వెనుక వేయకుండా బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది.


అలాంటి నాపై ధర్మపురి అరవింద్ గారు లక్ష్యంగా చేసుకొని కావాలనే నన్ను పార్టీకి దూరం చేసేందుకు కుట్రలు చేస్తూ, కించపరచడం,పార్టీ అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం ఇవ్వకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడం, నన్ను అభిమానించే నాయకులను, కార్యకర్తలను, మండల అధ్యక్షులను ఎవరిని నాతో తిరగవద్దని, కలవవద్దని ఎంపీ గారు మరియు ఆయన తొత్తులు భయానికి గురి చేసే కుట్రలు పన్నారు. ఒక రాజకీయ పార్టీ గానీ, నాయకుడు గానీ ఎదగాలంటే స్వేచ్ఛ అవసరం. అలాంటి స్వేచ్ఛ ప్రస్తుతం అరవింద్ గారి రూపంలో కనుమరు కావడం, నాపై ఆయన కుట్రపూరితంగా సామాజిక మాధ్యమాలు అసత్య ఆరోపణలతో కూడిన వీడియోలు సృష్టించడం నన్ను మరింత అసహనానికి గురిచేసింది’’ అని ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.