2001 నుంచి 2004 వరకూ కేంద్రంలో బీజేపీ హవా, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభ, వందేళ్ల కాంగ్రెస్ పార్టీ వంటి పెద్ద శక్తుల మధ్య కేసీఆర్ ఓ కొత్త పార్టీ పెట్టారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఆయన ఎత్తుకున్న అంశం, మాట్లాడిన తీరు వల్లే యావత్ ప్రజానీకం కేసీఆర్ వెంట నడిచారని అన్నారు. మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం (ఆగస్టు 14) కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కేటీఆర్ వెంట మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, ఎంపీ బిబి పాటిల్, అధికారులు పాల్గొన్నారు.


కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేటీఆర్ ప్ర‌క‌టించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.28 కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల రహదారి, స్వాగత తోరణ కమాన్, రోడ్డు మధ్యలో అధునాతన సెంట్రల్ లైటింగ్, మీడియన్, రోడ్డు డివైడర్లను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆర్ అండ్ బీ చౌరస్తా వద్ద కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. దాదాపు రూ.28 కోట్ల ఖర్చుతో సెంట్రల్ లైటింగ్, ఆరు లేన్ల రోడ్డు, స్వాగత‌ తోరణ కమాన్, సెంట్రల్ మీడియన్ ఏర్పాటు చేయడం పట్ల కేటీఆర్ అభినందనలు తెలిపారు. 


నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ.25 కోట్లు మంజూరు చేయాలని గంప గోవర్ధన్, సీఎం కేసీఆర్‌ను కోరగా, రూ.25 కోట్లు మంజూరు చేస్తూ ఈ రోజే ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. కామారెట్టి పట్టణంలో మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌ రోడ్లు, స్టేడియం, ఇంటర్నల్ రోడ్ల కోసం రూ.20 కోట్లు మంజూరు చేయాలని కోరారు. దీంతో వాటిని  కూడా మంజూరు చేస్తామని తెలిపారు. గంప గోవర్ధన్ అత్యంత సౌమ్యుడని, కామారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించి, జిల్లా కేంద్రంగా మార్చి, కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, మెడికల్ కాలేజీలు, రోడ్లు వంటి మంచి పనులు చేయించుకుంటున్నారని మంత్రి కేటీఆర్ వివరించారు.


ఎమ్మెల్యే సురేందర్‌ను ఈసారి 70 వేల మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపు ఇచ్చారు. గత ఎన్నికల్లో ఆయనకు అత్యధిక మెజారిటీ ఇచ్చారని అన్నారు. పొలాలకు 3 గంటల కరెంటు చాలని రేవంత్‌ రెడ్డి అంటున్నారని, కరెంటు కోసం బతిమాలుకున్న రోజులు మర్చిపోదామా? అని అడిగారు. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ ఇవ్వలేదని గతంలో రేవంత్‌ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు. ఏ పార్టీ అయినా సరే.. రైతులు ముందుగా కరెంట్‌ గురించి ఆలోచించాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు.