Adilabad News: నిండు గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దారి సరిగ్గా లేకపోవడంతో అంబులెన్సుకు ఫోన్ చేసినా వచ్చే వీలు లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబానికి ఎడ్లబండే దిక్కయింది. రాళ్లు, గుంతల్లో చీకటి వేళ అటవీ మార్గంలో బిక్కుబిక్కు మంటూ వెళుతున్న ఆమెకు నొప్పులు ఎక్కువ అయ్యాయి. అర్ధరాత్రి పూట ఆ అడవి తల్లే పురుడు పోసింది. తప్పని పరిస్థితిలో మార్గ మధ్యలో అడవిలో ప్రసవ వేదనను అనుభవించిన ఘటన అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో చోటు చేసుకుంది. 


బజార్ హత్నుర్ మండలం గిరిజాయ్ పంచాయతీ పరిధిలోని ఉమర్ద గ్రామానికి చెందిన జుగ్నక కవితకు రాత్రి 8 గంటల సమయంలో నొప్పులు వచ్చాయి. దారి, వాహన సదుపాయం, లేకపోవడంతో పాటు 4 కి. మీ వెళితేనే ఆటో సౌకర్యం ఉంటుంది. తప్పని పరిస్థితిలో ఎడ్లబండిపైనే తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే 2 కి. మీ వెళ్లాక నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలోనే అంటే అడవిలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఎడ్లబండిపై గిరిజాయ్ గ్రామానికి వెళ్లి అక్కడి నుంచి ఆటోలో 12 కి. మీ దూరం ప్రయాణించి రాత్రి 12 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు. కనీస రహదారి, వాహనం  సౌకర్యం లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతూ ఆసుపత్రికి చేరుకున్నారు. ఎప్పుడు తమకు ఇలాంటి పరిస్థితులే అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై వైద్యులు మాట్లాడుతు.. అర్థరాత్రి 12 గంటకు ఆసుపత్రికి వచ్చారని ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. 


ఏపీలోనూ ఇలాంటి ఘటనే..!


గతేడాది పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చిన తోలుమండ గ్రామానికి చెందిన కొండగొర్రి కాసులమ్మ అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. సాయంత్రం చినతోలుమండ గ్రామం నుంచి డోలీ సాయంతో కొండ కిందికి దించారు. అక్కడి నుంచి ఫీడర్ అంబులెన్స్ లో సమీపంలోని రావాడ రామభద్రాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించడంతో పండంటి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. సకాలంలో వైద్య సేవలు అందడం వలన తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు. చిన తొలిమండ గ్రామానికి రహదారి సదుపాయం లేకపోవడం వలన ఎవరికి ఏ జబ్బు చేసిన సరే వారికి డోలి మోతలే శరణ్యం. 


గర్భిణీ వసతి గృహాలు


ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఆ గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాల్సిందిగా గ్రామస్తులు వేడుకుంటున్నారు. రానున్నది వర్షాకాలం ఆరోగ్య సమస్యలు ఏం వచ్చినా మాకు డోలీ మోతలే దిక్కు. ఒక పక్క డోలీ మోస్తూ ఇంకొకపక్క వర్షంలో తడుస్తూ మోసుకు వచ్చినప్పుడు పిడుగులు పడతాయని భయం, అధిక వర్షం కురిస్తే ఏంచేయాలనే భయం ఉంటాయని గిరిజనులు అంటున్నారు.  గతంలో అప్పటి పీవో డాక్టర్ లక్ష్మీష ఏర్పాటుచేసిన గర్భిణీ వసతి గృహానికి ఏడు నెలలు నిండిన గిరిజన గర్భిణీలను తరలించేవారు. అలాంటి వసతి గృహాలు ఏర్పాటు చేస్తే గిరిజనుల ప్రాణాలు కాపాడే వాళ్లవుతారని ప్రజలు కోరుతున్నారు.