ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం గత కొద్దిరోజుల నుంచి అలజడి సృష్టిస్తోంది. ఆదిలాబాద్ మంచిర్యాల కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇప్పటికి పదుల సంఖ్యలో పశువులపై పెద్దపులి దాడి చేసింది. పెద్దపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలిస్తు పాదముద్రలను సేకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పులి గురించి వారికున్న సమాచారం మెరకు గ్రామాల్లో డప్పు చాటింపుతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.


ఆసిఫాబాద్‌ జిల్లాలోని చింతలమానేపల్లి, పెంచికల్ పేట్, కాగజ్‌నగర్‌ పరిసర అటవి ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రెండు మూడు రోజుల వ్యవధిలోనే కాగజ్‌నగర్‌ మండలం కొసిని, రేగలగూడ, అనుకోడ సమీప అటవీ ప్రాంతాల్లో పశువులపై పెద్దపులి దాడి చేసింది. పులిదాడిలో రెండు పశువులు మృత్యువాతపడ్డాయి. గత నెలలో కూడా చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్ మండలాల్లోను పులి రెండు పశువులను హతమార్చింది. ఇప్పుడు తాజాగా మళ్లీ కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తు అలజడి సృష్టిస్తోంది. కొసిని రేగలగూడ అటవి ప్రాంతంలో భీమేష్ అనే పశువుల కాపరి పశువులను కాస్తుండగా ఒక్కసారిగా పెద్దపులి ఓ ఆవుపై దాడి చేసింది. ఆవుపై పులి దాడి చేయడాన్ని పశువుల కాపరి భీమేష్ కళ్ళారా చూశానని చెప్పాడు. పక్కనున్న వారిని పిలిచి కేకలు వేయడంతో పులి కాసేపటికి ఆవును వదిలి అక్కడ నుంచి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయిందని చెప్పాడు. 


కాపరి తమ గ్రామస్తులకు పశువుల యజమానికి సమాచారం అందించాడు. పులి దాడిలో గాయపడ్డ ఆవును పశువైద్యశాలకు తీసుకెళ్ళి వైద్యం అందించారు. చికిత్స పొందిన ఆవు శుక్రవారం రాత్రి మృతిచెందింది. తిరిగి మరుసటి రోజు కాగజ్‌నగర్‌ మండలంలోని అనుకొడ అటవి ప్రాంతంలో మళ్ళీ పశువుల మందపై పులి దాడి చేసింది. ఓ లేగదూడపై పులి దాడి చేసి హతమార్చింది. ఈ విషయమై స్థానికులు అటవిశాఖ అధికారులకు సమాచారం అందించగా పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలిస్తు పులి పాదముద్రలను సేకరించారు. సమీప గ్రామాల్లో ఉండే ప్రజలు రైతులు,  పశువుల కాపర్లు తమ పశువులను దగ్గరలోనే మేపుకొవాలని అటవి ప్రాంతం వైపు వెళ్ళొద్దని, పులిపట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


మంచిర్యాల జిల్లాలోను పెద్దపులితో పాటు ఓ చిరుతపులి సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి నిల్వాయి జైపూర్‌ తో పాటు బెల్లంపల్లి పరిసర అటవి ప్రాంతాల్లో పులి సంచారంతో సమీప గ్రామాల్లో ఉన్న ప్రజలు, వ్యవసాయ పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉండే రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. కొటపల్లి మండలం బొప్పారం, వంచెపల్లి, ఎడగుట్ట తదితర ప్రాంతాల్లో  పులి పశవులపై దాడి చేసింది. రెండు పశువులు పులిదాడిలో మృతిచెందాయి. అటవీశాఖ అధికారులు పులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామ ప్రజలు రైతులు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని, అడవిలోకి ఎవరు వెళ్ళకూడదని డప్పు చాటింపుతో అప్రమత్తం చేస్తున్నారు.


పట్టుకొనేందుకు యత్నిస్తున్న అటవీ అధికారులు


పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవిశాఖ అధికారులు మాత్రం పులి సంచరించిన ప్రాంతాల్లో వాటి పాదముద్రలను సేకరించి పులిజాడలను తెలుసుకుంటు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.  ఆయా గ్రామాల్లో డప్పు చాటింపుతో పులి గురించి అప్రమత్తం చేస్తున్నారు. అడవుల్లోకి పశవులను కాసేందుకు వెళ్ళే కాపరులు.. సమీప పంటపొలాల్లోకి వెళ్ళే రైతులు కూలీలు ఒకవేళ ఎవరికైనా అకస్మాత్తుగా పులి ఎదురైన అందరు గుంపులుగా ఉండాలని ఒకరిద్దరు ఉండకూడదని, పులికి ఎలాంటి హాని చేయకూడదని, పులి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయా సూచనలు అందిస్తున్నారు.