Science Fair:  ఉట్నూర్ కుమ్రం భీం కాంప్లెక్స్ లో ఉమ్మడి జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనలను తిలకించారు. విద్యార్థులు, గైడ్ టీచర్లకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  


గిరిజన విద్యార్థులు విద్యతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాలలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని ఐటీడీఏ మీటింగ్ హాలులో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శనను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొన్నారు. 




"విద్యతోనే అభివృద్ధి సాధ్యం"


గిరిజన విద్యార్థులు విద్యతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించాలని మంత్రి సూచించారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను చదువులో ప్రోత్సహించాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఐటీడీఏ పీఓ కె. వరుణ్ రెడ్డి మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతికతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గిరిజన విద్యార్థులు వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేయాలని కోరారు.




" సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్న 8 డివిజన్ల విద్యార్థులు"


ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ దిశగా కృషి చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని 133 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల నుండి  ప్రతి డివిజన్ నుండి 12 మంది చొప్పున మొత్తం 8 డివిజన్ల నుండి 96 మంది విద్యార్థులు సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్నారని మంత్రి తెలిపారు. సుమారు 4000 మంది విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శనను సందర్శించారని ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. 




సైన్స్ ఫెయిర్ లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి 516 మంది విద్యార్థులు, 280 మంది ఇన్ స్పైర్ విజేతలు, గైడ్ టీచర్లు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మెన్ రాథోడ్ జనార్ధన్, మాజీ ఎంపీ జి. నగేష్, ఖానాపూర్ శాసనసభ్యురాలు రేఖా నాయక్, ఆదిమ గిరిజన సలహా మండలి అధ్యక్షులు కనక లక్కేరావు, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఎంపీపీ జైవంతు రావ్, ఐటీడీఏ ఎస్డీసీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డైరెక్టర్ డా. దిలీప్ కుమార్, ఎటీడీఓలు క్రాంతి, నిహారిక సౌజన్య, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు సైన్స్ ఫెయిర్ తర్వాత నిర్వహించిన సభలో పాల్గొన్నారు.