Adilabad News: విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు బోధించాలని నిర్మల్ కలెక్టర్, ఐటీడీఏ ఇంఛార్జీ పీఓ కే. వరుణ్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని జామడ బాలికల ఆశ్రమ పాఠశాల గొల్డేన్ జుబిలీ (50 ఏళ్ల స్వర్ణోత్సవ) వేడుకలు మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డికి విద్యార్థులు... ఆదివాసీ సాంప్రదాయ డోలు, వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయన సరస్వతి చిత్ర పటానికి పూల మాల వేసి, జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఆదివాసీ విద్యార్థినిలు  "నాటు నాటు" డ్యాన్స్.. 
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, పాఠశాల సిబ్బంది గోల్డెన్ జూబ్లీ వేడుకలకు వచ్చినందుకు పీఓ వరుణ్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం విద్యార్థినిలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నృత్యాలు చేశారు. ఆదివాసీ విద్యార్థినిలు  "నాటు నాటు" పాటపై డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. పలువురు విద్యార్థినిలు సాంప్రదాయ గిరిజన బంజారా నృత్యాలు చేశారు. పాఠశాల విద్యార్థినిలుంతా కేరింతలు కొడుతూ కార్యక్రమంలో ఉత్సాహాన్ని నింపారు.




ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం అధికారులు విద్యార్థులకు జ్ఞాపికలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ డీడీ దిలీప్ కుమార్, పిడి విశ్వనాథ్, ఏటీడీఓ క్రాంతి కుమార్, రాయిసెంటర్ జిల్లా సార్ మేడి మెస్రం దుర్గు పటేల్, సర్పంచ్ మాడావి ముక్త రూప్ దేవ్, ప్రధానోపాధ్యాయులు చౌహన్ నెహ్రూ, ఉపాధ్యాయులు, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.


"ప్రైవేటు పాఠాలలకు దీటుగా చదువు చెప్పాలి"


ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ కే. వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. జామడ పాఠశాల గొల్డేన్ జుబిలీ వేడుకలను చాలా బాగా నిర్వహించారని ప్రశంసించారు. విద్యార్థినులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయని తెలిపారు. సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా అధునాతన పద్ధతులను అవలంభించి విద్యాబుద్ధులు నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఇతర రంగాలలో కూడా ప్రావీణ్యం కల్పించి వారిని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉత్తమ ర్యాంకులు సాధించేలా గిరిజన ఆశ్రమ పాఠశాలలను తీర్చిదిద్దాలని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విద్యార్థులు శ్రద్ధతో చదివి జీవితంలో ఉన్నత స్థాయిలో నిలవాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తీసుకరావాలని కోరారు. 


గిరిజన విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి: మలావత్ పూర్ణ


ఈ సందర్భంగా మాలావత్ పూర్ణ మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, అన్ని రంగాల్లోనూ ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలన్నారు. గిరిజన బిడ్డగా తనకు అందరి శ్రేయస్సుతోనే 14 ఏళ్ల వయసులోనే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించానన్నారు. అందరూ కష్టపడి చదువుల్లో ముందుండాలని, అన్ని రంగాలలోనూ రాణించి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు.