Adilabad ITDA Officers: ఏప్రిల్ 8వ తేదీన "అప్పుడు పాపకు పాలు కోసం, ఇప్పుడు పశువుల మేత కోసం - మళ్లీ మొదటికొచ్చిన తాత, తండ్రి అవస్థలు" అనే హెడ్డింగ్ తో ఏబీపీ దేశం రాసిన కథనానికి స్పందన లభించింది. తల్లి లేని పసిపాపకు పాలిచ్చే ఆవుల మేతకోసం ఐటీడీఏ ఏధికారులు రూ.25,000 ససాయం అందజేశారు. ఈ క్రమంలోనే పాప తండ్రి జంగుబాపుకు ఉట్నూర్ ఐటిడీఏ ఏపీఓ (పీవీటీజీ) భాస్కర్ చెక్కును అందజేశారు. అయితే తమపై ఏబీపీ ప్రచురించిన కథనం వల్లే తమకు సాయం అందిందంటూ... పాప తండ్రి జంగుబాపు ఏబీపీకి కృతజ్ఞతలు తెలిపాడు.
అసలేం జరిగింది?
ఆదిలాబాద్ జిల్లాలో ఓ తల్లిలేని పసిపాప పాలకోసం తండ్రి, తాత ఇద్దరు అనేక కష్టాలు పడుతున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రాజుగూడ గ్రామానికి చెందిన కొడప పారుబాయి జనవరి 10వ తేదీన ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి తీసుకెళ్లగా వారం రోజుల తరువాత రక్తహీనత కారణంగా అనారోగ్యానికి గురైంది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించగా జనవరి 21న ఆమె మరణించింది. దీంతో తల్లిలేని పసిపాపకు పాల కోసం తండ్రి కొడప జంగుబాపు తాత బాపురావ్, రాజుగూడ నుంచి ఇంద్రవెల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొచ్చి పాప ఆకలి తీర్చారు.
మార్చి నెల 23న ఈ విషయం మంత్రి హరీశ్ రావు దృష్టికి రావడంతో వెంటనే అధికారులతో మాట్లాడి పాలిచ్చే ఆవును అందించి ఆదుకున్నారు. అలాగే వారం రోజుల క్రితం బోథ్ సెషన్ జడ్జీ హుస్సేన్ సైతం పసిపాపకు పాలిచ్చే మరో ఆవును అందజేశారు. తల్లిలేని పసిపాపకు పాలిచ్చే తల్లిలాంటి ఆవును అందించి ఆదుకోవడంతో పాప తండ్రి, తాత.. మంత్రి హరీశ్ రావు, జడ్జీ హుస్సేన్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆరు వేలు అప్పు చేసి
అయితే ఇప్పుడు ఆ పసిపాపకు పాలిచ్చే ఆవులకు మేత కరవైంది. మరీ పాపకు పాలు కావాలంటే ఆవులకు మేత కావాలి. పాపతో పాటు రెండు ఆవులకు ఉన్న రెండు దూడలకు పాలు సరిపోవాలి. వీటితో పాటు తమ రెండు ఎద్దులకు సైతం మేత అవసరం. ఇప్పటి వరకు వాటి మేతనే ఆవులకు సైతం వేసి కాలం వెల్లదీశారు. ఇప్పుడు మాత్రం మేత లేదు. వేసవిలో చుట్టూ ప్రక్కల ఎక్కడా పశుగ్రాసం దొరకడం లేదు. గుట్టలపై ఇప్పుడు ఎలాంటి పంటరాదు. ఈ బండరాళ్ల భూమిలో గడ్డికూడ మొలవదు. దీంతో ఆ తాత తండ్రి మళ్లీ పది కిలోమీటర్ల దూరం ప్రయాణించి పశువుల మేత కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పాప ఆలన పాలన జంగుబాపు తల్లి ఇంటివద్దే ఉంచి అంతా తానే చూస్తోంది. అయితే వీరిద్దరికి కూడా ఎలాంటి ఉపాధి దొరకడం లేదు. అడవిలో ఉండే రాజుగూడలో వేసవిలో ఏం దొరకదు. చేతిలో చిల్లి గవ్వకూడా లేదు. వర్షాధార పంటలపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రేషన్ దుకాణంలో వచ్చే సరుకులతోనే ఇళ్లు గడుస్తుంది. ఇలాంటి తరుణంలో పశువుల మేత కోసం తాత కొడప బాపురావ్ ఇంద్రవెల్లికి చెందిన వైకుంఠం అనే ఓ వ్యక్తి వద్ద ఆరువేల రూపాయలు అప్పుగా తీసుకొని హర్కాపూర్ గ్రామంలో ఓ రైతు వద్ద జొన్న సొప్పా (మేత) కొనితెచ్చాడు. ఒక సొప్పా కట్టా 15 రూపాయల చొప్పున మొత్తం 400 సొప్ప కట్టలు, మొత్తం 6000 రుపాయలు ఇచ్చి ఓ వాహనంలో ఊరికి తెచ్చారు.
పశువులతో పెరిగిన ఖర్చు
ఈ సొప్ప ప్రస్తుతం రెండు పాలిచ్చె ఆవులకు, తన వ్యవసాయంలో పనిచేసే రెండు ఎద్దులకు వేసి ఆకలి తీర్చుతున్నారు. మరో 20 లేదా 25 రోజుల వరకు ఈ మేత సరిపోతుంది. తరువాత మళ్లీ మేత అవసరం పడుతుంది. వారికి ఎలాంటి ఏ ఇతర ఉపాది లేదు వారి వద్ద డబ్బులు సైతం లేవు. ఐటీడీఏ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాధితులు అంటున్నారు. ఇప్పుడు పాప ఆకలి, పశువుల ఆకలి తీర్చడం కోసం అప్పు చేసి మరీ మేత తీసుకొచ్చారు. రెండు నెలలు మాత్రం ప్రతిరోజు పాల ప్యాకెట్ కోసం రూ.30, ఇంద్రవెల్లికి ఆటో ఛార్జీకి రాను 20, పోను 20 మొత్తం 70 రూపాయలు ఖర్చయ్యాయి. సుమారుగా నెలలో అన్ని ఖర్చులు కలిసి 3000 రూపాయల వరకు ఖర్చయ్యేది. ఇప్పుడు రెండు ఆవులు, వాటి రెండు లేగదూడలు, మరో రెండు ఎద్దులు వీటన్నింటినీకి సరిపడా మేతకు నెలసరిపడా 6000 రూపాయలు ఖర్చయింది. అదీ అప్పు చేసి మరీ మేత కొనుకొచ్చారు. ఖర్చు భారం పెరిగినందున వారి వద్ద ఎలాంటి ఉపాధి లేకపోవడంతో వారు తమ గోడును ఏబీపీతో పంచుకున్నారు. తమ కష్టాలు తీర్చేందుకు ఎవరైనా దాతలు ఉంటే సహకరించి తమ పశువులకు మేతను అందించాలని కోరుతున్నారు.