Adilabad Politics: ఆదిలాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. బోథ్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో (BRS Party) గ్రూపుల గోల తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా గ్రూపులు కొనసాగుతుండగా, ఆదివారం ఈ పోరు మరింత వేడెక్కింది. రెండు వర్గాలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంతో అటు కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ (MLA Rathod Bapu Rao) తమ సమావేశం అడ్డుకునేందుకు ప్రయత్నించారని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ (Tula Srinivas) వర్గం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 


ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో వర్గపోరు కొనసాగుతోంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలింది. దీంతో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఎంపీపీ తుల శ్రీనివాస్ మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ఈ విషయం గతంలో అధిష్టానం దృష్టికి వెళ్లడంతో వారికి నచ్చచెప్పారు. రెండు వర్గాల మధ్య ఎలాంటి విభేధాలు లేకుండా చూసుకోవాలని అధిష్టానం ఇద్దరికి నచ్చజెప్పింది. దీంతో చాలా రోజులుగా ఇరువర్గాల నేతలు సైలెంట్ అయ్యారు. అయితే, సర్దుకుంది అనుకున్న వర్గ పోరు ఆదివారం మళ్లీ తెరపైకి వచ్చింది.


బోథ్ మండల (Boath Mandal) కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్యే బాపురావ్ (MLA Rathod Bapu Rao) ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దానికి పోటీగా ఎంపీపీ తుల శ్రీనివాస్ (Tula Srinivas) ఆధ్వర్యంలో బోథ్ మండల కేంద్రంలోనే భరోసా పేరుతో మరో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకే మండలం రెండు సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎంపీపీ తుల శ్రీనివాస్ తలపెట్టిన సమావేశాన్ని అడ్డుకోవడానికి ఎమ్మెల్యే ఫంక్షన్ హాల్ కి తాళం వేయించారు. దీంతో పరిచయ గార్డెన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకి తుల శ్రీనివాస్ వర్గీయులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ఆవేశంతో నినాదాలు చేశారు.


ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ.. బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాపురావ్ బీఆర్ఎస్ కార్యకర్తలకు చేసింది ఏమీ లేదని.. అందుకే పార్టీలో అసలైన కార్యకర్తలు అందరం ఎంపిపి తుల శ్రీనివాస్ వైపు నిలబడ్డామని స్పష్టం చేశారు. తన విలువ తగ్గుతుందని తమ సమావేశం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే రూ. 2 లక్షలు ఇచ్చిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారని దుయ్యబట్టారు. కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకే సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ తుల శ్రీనివాస్ చెప్పుకొస్తున్నారు. ఎంపీపీ తుల శ్రీనివాస్ వెనుక పార్టీ సీనియర్లు ఉండి కథ నడిపిస్తున్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే అంటే లెక్కలేకుండా ఎంపీపీ తుల శ్రీనివాస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదని ఎమ్మెల్యే వర్గం నాయకులు హెచ్చరిస్తున్నారు. పోటా పోటీగా సమావేశాలు ఏర్పాటు చేయడం అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.