Adilabad News: చాలా కాలం స్కూళ్లు లేక ఆటలకి అలవాటు పడ్డ పిల్లలు స్కూళ్లు తెరిచేసరికి వెళ్లబోమని మొండికేస్తున్నారు. మారాం చేస్తూ, ఏడుస్తున్న పిల్లల్ని సముదాయించి స్కూలుకు పంపలేక కొంత మంది తల్లిదండ్రులు తంటాలు పడుతున్నారు. ఆ బాధ సాక్షాత్తూ కలెక్టర్ కీ తప్పలేదు. ఆదిలాబాద్ కలెక్టర్ గా ఉన్న సిక్తా పట్నాయక్ తన కుమారుడు సారంగ్ ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం స్కూళ్లు తెరిచారు. తన తనయుడ్ని మొదటి రోజు స్కూల్లో దిగబెట్టేందుకు కలెక్టర్ కూడా అక్కడికి వచ్చారు.


స్కూలు వరకూ వచ్చిన కలెక్టర్ తనయుడు తరగతి గదిలోకి వెళ్లేందుకు మొండికేశాడు. వెళ్లనని వెనక్కి తగ్గాడు. ఏడుపు మొదలు పెట్టాడు. దీంతో సారంగ్ ను బుజ్జగించిన టీచర్లు తరగతి గదిలోకి వెళ్లేలా చేశారు. చివరకు టీచర్లు అంతా బాలుడితో మాట్లాడి, ఫ్రెండ్‌షిప్ చేసుకొని ఎట్టకేలకు లోపల కూర్చొబెట్టారు.


రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు ఓపెన్
తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి (జూన్ 13) బడి గంటలు మోగాయి. దాదాపు రెండేళ్ల తర్వాత స్టూడెంట్స్ జూన్ నెలలోనే స్కూల్లోకి అడుగు పెట్టారు. సాధారణంగా ప్రైమరీ స్కూలు పిల్లలు స్కూళ్లు ఓపెన్ అంటే.. కొత్త పుస్తకాలు, కొత్త బ్యాగ్స్, కొత్త యూనిఫాంపై మోజుతో కాస్త ఉత్సాహం చూపిస్తారు. తల్లిదండ్రులు కూడా వాటి ఆశ చూపి పొద్దు్న్నే నిద్రలేచి.. త్వరత్వరగా రెడీ అయి.. స్కూల్ కు వెళ్లారు. అయితే మరికొందరు పిల్లలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా అంగన్ వాడీ, ప్రీ ప్రైమరీ చదివే పిల్లల్లో ఈ మారాం చేసే గుణం ఎక్కువ ఉంటుంది. 


మొత్తానికి కలెక్టర్ కుమారుడు సారంగ్ ఇలా మారాం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చివరికి కలెక్టర్ కు కూడా పిల్లల విషయంలో కష్టాలు తప్పలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకా ఎప్పుడూ బిజీగా ఉండే కలెక్టర్ కొడుకును స్కూల్లో దిగబెట్టేందుకు రావడం పట్ల కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.