నిజామాబాద్ నగరంలో దివ్యాంగుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టచ్ అండ్ స్మెల్ పార్క్ నిర్మాణాన్ని ప్రజా ప్రతినిధులు గాలికొదిలేశారు. ఆరేళ్ల క్రితం ఆర్భాటంగా ప్రారంభించిన పార్క్ పనులు ముందుకు సాగటంలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది.


దివ్యాంగుల కోసం నిజామాబాద్‌లోని తిలక్ గార్డెన్ లో 2016 ఆగస్టు 16 రూ.50 లక్షల అంచనాతో టచ్ అండ్ స్మెల్ పార్క్‌ను అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కవిత ముఖ్య అథితులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఆరేళ్లు గడిచినా టచ్ అండ్ స్మైల్ పార్కు పనులు మాత్రం పూర్తి కాలేదు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం దీని నిర్మాణ పనులు చూస్తున్నట్లు సమాచారం. మొత్తం 24 గదులను నిర్మించారు. అందులో ఇంకా కొన్నింటికి పైకప్పు వేయలేదు. పూర్తికావటానికి ఇంకెంత కాలం పడుతుందో తెలియదు. 


ఈ పార్కు అంతర్జాతీయ స్థాయిలో దివ్యాంగుల జ్ఞానాభివృద్ధి కోసం ముట్టుకుంటే వస్తువులను గుర్తించేలా...వాసన చూసి పసిగట్టేలా వివిధ రకాల వస్తువులను ఏర్పాటు చేస్తారని నాడు ఎంతో ఘనంగా చెప్పారు. ఈ టచ్ అండ్ స్మెల్ పార్కులో చారిత్రాత్మక కట్టడాలు, ఇందులో తాజ్ మహల్, చార్మినార్, కుతుబ్ మీనార్, స్టాట్యూ ఆఫ్ లిబర్ట్ వంటి కట్టడాల నమునాలు ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేశారు.


స్పర్శతో గుర్తుపట్టే విధంగా ఉంటాయని నిపుణులు సైతం చెప్పారు. ఏమైందో ఏమో కానీ పార్కును టచ్ చేసి వదిలేశారు. గతంలో కలెక్టర్ యోగితా రాణ పార్క్ పనుల విషయంలో ప్రత్యేక చొరవ చూపారు. అనంతరం టచ్ అండ్ స్మెల్ పార్క్‌ పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. టచ్ అండ్ స్మెల్ పార్కు నిర్మాణ పనులపై పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారిని వివరణ కోరగా మొదట పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు వదిలేశారని నిధుల కొరత కూడా ఉందని చెప్పారు. నిర్మాణాలపై కరెంట్ లైన్ ఉండటంతో పనులు ఆలస్యం అవుతున్నాయని త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. టచ్ అండ్ స్మెల్ పార్కును తెలంగాణలోనే మొదటి సారిగా నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నప్పటికీ పనులు పార్కు ఎప్పుడు పూర్తవుతుందో అన్నసందేహం దివ్యాంగుల్లో ఉంది. న్యూజిలాండ్ తర్వాత ఇక్కడే పార్కు ఏర్పాాటు కాబోతోందని అప్పట్లో చెప్పారు. కానీ ఆ పనులు తీరు చూస్తుంటే ఎప్పటికి పూర్తవుతుందో అన్న అనుమానం కలుగుతోంది. 


Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?
Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి