YS Sharmila : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో  వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగుతోంది. అక్కడ నిర్వహించిన సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ... కేసీఆర్ తో తెలంగాణ ప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని అన్నారామే. రుణమాఫీ దగ్గర నుంచి ఇంటికో ఉద్యోగం వరకు ప్రతి మాట మోసమే అని విమర్శించారు. ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ లేవు అంటే హమాలి పని చేసుకోండి అంటున్నారు కేసీఆర్ అని అన్నారు షర్మిల. పెద్ద కొడుకు అని చెప్పిన కేసీఆర్ ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తున్నారని విమర్శించారు. ఒకరు బతకండి, ఒకరు చావండి అని చెప్తున్నారన్నారు. వైఎస్ఆర్ హయాంలో రేషన్ కింద నిత్యావసర వస్తువులు ఇచ్చేవారని, ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తూ సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. వెల్ఫేర్ హాస్టళ్లలో పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారని మండిపడ్డారు. ఆ బిడ్డలకు ఓట్లు ఉండవని  చెప్పి హీనంగా చూస్తున్నారని విమర్శించారు. 


ధరలు భారీగా పెంచేశారు


పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు భారీగా పెంచేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. వంట సరుకులు పెంచి మహిళల ఉసురు పోసుకుంటున్నారన్నారు. వైఎస్ఆర్  ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెరిగితే ప్రభుత్వం భరించేలా చేశారన్నారు. నాయకుడు అంటే వైఎస్ఆర్ అని చెప్పారు షర్మిల. బతికినంత కాలం ప్రజల కోసమే బతికారని, ప్రజల కోసమే చనిపోయారన్నారు. ఇప్పుడు ప్రజల పక్షాన కొట్లాడే పార్టీ లేనే లేదన్నారు.  8 ఏళ్లుగా కేసీఅర్ ను ప్రశ్నించే పార్టీ లేకుండా పోయిందని స్పష్టం చేశారు.  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం ప్రజలను మోసం చేశాయన్నారు. ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడటం కోసం పార్టీ పెట్టానన్నారు.  వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి గడపకు అందిస్తామని అన్నారు షర్మిల.






స్పీకర్ కు సవాల్ 


 పాదయాత్రలో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా షర్మిల విమర్శలు కురిపించారు.  తాజాగా ఆమె స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డినే టార్గెట్ చేశారు. స్పీకర్ సొంత నియోజకవర్గమైన బాన్సువాడలో పాదయాత్ర నిర్వహించిన షర్మిల స్పీకర్‌కు సవాల్ విసిరారు. స్పీకర్ ఒకరోజు తనతో పాదయాత్రలో పాల్గొనాలన్నారు.  స్పీకర్ తన నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని నిరూపిస్తే తాను పాదయాత్రను నిలిపివేసి ఇంటికి వెళ్లిపోతానని సవాల్ చేశారు. ముక్కునేలకు రాసి క్షమాణలు చెప్పి వెళ్లిపోతానన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇళ్లు అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇవ్వలేదని ఆరోపించారు.  


Also Read : వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం చేసిన తెలంగాణ సర్కారు