Hyderabad News: సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ వేదికగా అమ్మాయిలను మోసం చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సీపీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ ఆయన కార్యాలయంలో అడిషనల్ డీసీపీ స్నేహ మెహర, ఏసీపీ కేవీఎం ప్రసాద్ లతో కలిసి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. అయితే సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన, ముక్కూ, మొహం తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పంపకూడదని పోలీసులు సూచించారు.
అసలేం జరిగిందంటే..?
బేగంపేటకు చెందిన ఓ యువతికి ఇన్ స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. యూఎస్ లో ఉంటున్నానని చెబుతూ స్నేహం చేశాడు. చాలా రోజుల పాటు చాటింగ్ చేసిన వీరిద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. అయితే స్నేహానికి గుర్తుగా నీకు యూఎస్ నుంచి విలువైన బహుమతులు పంపిస్తున్నానంటూ సదరు యువతిని నమ్మించాడు. ఢిల్లీ కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నామని యువతికి ఫోన్ చేసి రెండున్నర లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆ తర్వాత ఆమె ఫోన్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ లేదు. రోజుల తరబడి వేచూ చూసినా ఎలాంటి బహుమతీ రాలేదు. అలాగే స్నేహితుడు కూడా మెసేజెస్ కి స్పందించడం మానేశాడు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన యువతి... పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్త చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నైజీరియాకు చెందిన అల్లోట్ పీటర్ అలియాస్ చిలుజా, రొమాన్స్ జాషువాలను గుర్తించి అరెస్ట్ చేసినట్లు గజరావు భూపాల్ తెలిపారు.
ఇన్ స్టాలో ఝాముండా ఆగడాలు..
ఇన్ స్టాగ్రామ్ లో ఝాముడా(Jhamunda), ఝాముండా అఫీషియల్(jhamunda_official), ఝాముండా అఫీషియల్ 2(jhamunda_official_2) అనే పేరుతో ఓ ముఠా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ మహిళలను కించపరుస్తోంది. ఒక వర్గానికి చెందిన మహిళలనే టార్గెట్ చేస్తూ వారిని ఫోటోలు, వీడియోలు తీసి.. ఆ వీడియోలను ఇన్ స్టాగ్రామ్ పేజీల్లో పోస్టు చేస్తోంది. అసభ్యకర పదజాలం వాడుతూ ఆ వీడియోపై, ఫోటోలపై కామెంట్లు చేస్తూ వాటిని వైరల్ చేస్తోంది.
ఒక వర్గం వారే ఆ ముఠా లక్ష్యం
మీరు మీ స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్తుంటే.. ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా అనుసరిస్తున్నట్లు ఊహించుకోండి. మీరు చేసేదంతా షూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తారు. వింటుంటే భయమేస్తోందా.. ఝాముండా ఇన్ స్టా పేజీలో జరిగే తతంగం ఇదే. హైదరాబాద్‌లో మోటారు వాహనాల నుంచి మాల్స్ వరకు వివిధ బహిరంగ ప్రదేశాలలో గుర్తు తెలియని వ్యక్తులు.. కొంత మంది యువతీ యువకులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను చిత్రీకరించి మా కమ్యూనిటీ పరువు నాశనం చేస్తున్నారంటూ అసభ్యకర పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తమకు సంబంధించిన పోస్టులు ఇతర వ్యక్తుల నుంచి వారికి చేరడంతోనే బాధితులకు ఈ ముఠా ఆగడాలు తెలుస్తున్నాయి. కొంత మంది బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ పేజ్ లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని పోలీసులు ఇన్ స్టాగ్రామ్ కు లేఖ రాశారు. అలాగే ఝాముండా పేజ్ పై 506, 509, 354(D) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.