Telangana News: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈనెల 22వ తేదీ నుంచే కేంద్రాలను ప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ధాన్యం కొనుగోళ్ల వ్యూహ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 1.50 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. సుమారు కోటి టన్నుల వరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. దశల వారీగా 6 వేల 800 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోనే పంట ముందుగా రానున్న దృష్ట్యా తొలుత అక్కడ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సాధారణ రకానికి కనీస మద్దతు ధర రూ.2,040
బోధన్, జగిత్యాల, భువనగిరి ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు పూర్తి అయ్యి విక్రయానికి వస్తున్నాయి. వ్యాపారులు కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో వచ్చేవి సన్న రకం. ప్రస్తుతానికి రికార్డు ధర పలుకుతోంది. ఈ సీజనుకు ధాన్యం కనీస మద్దతు ధరను సాధారణ రకానికి క్వింటాకు రూ.2,040గా ఏ గ్రేడుకు రూ.2,060గా కేంద్రం నిర్ణయించింది. అయితే గడిచిన వానాకాలంలో సుమారు 71 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడు మాత్రం 90 లక్షల నుంచి కోటి టన్నుల వరకు కొనేందుకు సమాయత్తం అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మిల్లులకు ధాన్యం తరలించేందుకు వీలుగా జిల్లాల వారీగా రవాణా కాంట్రాక్టులకు వచ్చే వారంలోగా ఖరారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 30 కోట్ల గోనె సంచులు అవసరం అని అంచనా వేశారు. ప్రస్తుతానికి 15 కోట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో చాలినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచని పక్షంలో ఈ దఫా కూడా రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రస్తుత సీజనులో తరచుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కిందటేడాది కేంద్రాలకు తీసుకు వచ్చిన ధాన్యం తడవడమే కాకుండా వర్షాలకు కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. అధికారులు టార్పాలిన్ల సంఖ్యను పెంచడంతో పాటు కొనుగోలు కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితి లేకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది.
అకాల వర్షాలు కురిసినా ఆగమవ్వాల్సిన అవసరం లేదు..
అకాల వర్షాలు కురుసి ధాన్యం తడిచిపోయినా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులకు త్వరగా ప్రక్రియ ముగిసే విదంగా యుద్ద ప్రతిపాధికన కొనుగోలు కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు ధాన్యాన్ని కొని మిల్లులకు పంపి కిలో తరుగు లేకుండా చూసుకుంటామని అన్నారు. కనీస మద్దతు ధరల ప్రకారం వరి పంట సేకరణ చేయడమే కాకుండా అకాల వర్షాలు, గోనె సంచుల ఇబ్బందులు వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్కున్నామన్నారు. రైతులకు సంపూర్ణంగా అండగా నిలవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం పోటీ రాలేదని మంత్రి పేర్కొన్నారు.