Revanth Reddy : నిజామాబాద్ జిల్లా మంచిప్ప గ్రామ శివారులో చేపడుతున్న మంచిప్ప రిజర్వాయర్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సందర్శించారు. 1.5 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టును 3.5 టీఎంసీలకు పెంచటాన్ని ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో మంచిప్ప ప్రాజెక్ట్ ను 1.5 టీఎంసీలు డిజైన్ చేశారని, బీఆరెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో 3.5 టీఎంసీలకు పెంచారన్నారు. దీంతో తమ భూములు, గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని బాధితులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఆనాడు జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టి వారి గొప్పదనాన్ని చెప్పాలనుకున్నామని అన్నారు రేవంత్ రెడ్డి. రూ. 900 కోట్ల పైగా ఖర్చు చేసి 75 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. కొండెం చెరువు కెపాసిటీ 0.84 టీఎంసీలు, ఈ ప్రాంతంలో పేదల భూములు ముంపునకు గురవుతాయని, ఉన్నదాంట్లోనే లక్ష 83 వేల ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్నారు. ఇంకో రూ. 300కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతానికి సాగు నీరు అందేదని అన్నారు.
సీఎం కేసీఆర్ స్వార్థానికి ఈ ప్రాజెక్టు బలైంది
"కేసీఆర్ మంచిప్ప ప్రాజెక్టు బలైంది. ఆయన అవినీతికి ఈ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ. రూ.3500 కోట్లకు ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచారు. భూసేకరణతో 10 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆయకట్టు పెరగక పోయినా ఇక్కడి పేదలను భూ నిర్వాసితులను చేశారు. రూ. 300 కోట్లకు పూర్తి కావాల్సిన ప్రాజెక్టును రూ 3500 కోట్లకు పెంచారు. ఉమ్మడి రాష్ట్రంలోలాగానే కేసీఆర్ పాలనలో అదే వివక్ష కొనసాగుతోంది. భూములు కోల్పోయిన రైతులు నిరసన తెలిపితే 307 కేసులు పెట్టారు.17 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వారిపై కేసులను బేషరతుగా ఉపసంహరించుకుని విడుదల చేయాలి. తొమ్మిదేళ్లయినా 21వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదు." - రేవంత్ రెడ్డి
అనని వాటిని అన్నట్లు రాశారు
మంచిప్ప ప్రాజెక్ట్ పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. భూనిర్వాసితుల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. రీడిజైన్ ను వెనక్కి తీసుకుని పాత డిజైన్ ప్రకారం ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలకు ఊరట కలిగించాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ లో సీనియర్లు అమ్ముడుపోయారని ఓ పత్రిక తప్పుడు వార్తలు రాసిందని విమర్శించారు. నేను సీనియర్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. నేను అనని వాటిని అన్నట్లుగా రాయడం సరైంది కాదన్నారు. మీడియా సంయమనం పాటించాలని సూచించారు. అలాంటి వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాన్న రేవంత్ రెడ్డి... రాజకీయ వివాదాలు సృష్టించి సమస్యలు జఠిలం చేయొద్దని అన్నారు. సీనియర్లపై తాను వ్యాఖ్యలు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.