Vundavalli On Margadarsi : మార్గదర్శి చిట్స్ గతంలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఇచ్చిన సమాచారాన్ని సీఐడీ అధికారులకు పంపుతున్నానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మార్గదర్శిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు అనడం సరికాదన్నారు. మార్గదర్శిలో తప్పు జరిగిందా లేదా అనేది తేలాలన్నారు. మార్గదర్శిలో డబ్బులు ఎగ్గొట్టారని నేను ఎప్పుడూ అనలేదన్నారు. డిపాజిట్లు సేకరణ చట్టవిరుద్ధం అంటున్నానని ఉండవల్లి తెలిపారు. రామోజీరావుది రూ.15 వేల కోట్ల సంస్థానం అని ఆరోపించారు. రామోజీకి శిక్ష పడాలని నేను కోరుకోవడం లేదన్నారు. తప్పు జరిగిందా లేదా అని తేలాలన్నారు.
ఈడీతో దర్యాప్తు చేయాలి
మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై ఈడీతో దర్యాప్తు జరిపించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. మార్గదర్శి చిట్స్‌కు సంబంధించి గతంలో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఇచ్చిన సమాచారాన్ని సీఐడీ అధికారులకు పంపుతున్నానని చెప్పారు. ఏపీ చిట్‌ఫండ్ యాక్ట్ 14(2) ప్రకారం సేకరించిన నగదును బ్యాంకులో డిపాజిట్ చేయాలని, కానీ మార్గదర్శిలో అలా జరగలేదన్నారు. చట్ట విరుద్ధంగా చిట్టీల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారని ఆరోపించారు. మార్గదర్శిలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై 2008లోనే మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. మార్గదర్శి ఫైనాన్స్ షేర్‌పై తాను కేసు పెట్టే సమయానికి రూ.1360 కోట్ల నష్టాల్లో ఉందని ఉండవల్లి స్పష్టంచేశారు. సంస్థ నుంచి కనీస సమాచారం కూడా అధికారులకు యాజమాన్యం ఇవ్వడం లేదన్నారు. రామోజీరావు సెలబ్రిటీ కాబట్టి ఇప్పటిదాకా అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
యాజమాన్యం సహకరించడంలేదు- స్టాంప్స్ అండి రిజిస్ట్రేషన్ శాఖ
మార్గదర్శిలో నిర్వహించిన సోదాల్లో యాజమాన్యం సహకరించడం లేదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ తెలిపారు. మార్గదర్శిలో రికార్డుల నిర్వహణ సరిగా లేదని, చిట్‌ఫండ్స్ నగదు ఇతర సంస్థలకు మళ్లిస్తున్నారని వెల్లడించారు. అక్టోబర్, నవంబర్ లో 37 చిట్ ఫండ్ యూనిట్లలో, 17 మార్గదర్శి బ్రాంచ్ లో తనిఖీలు చేశామన్నారు. మార్గదర్శి బ్రాంచ్ ఫోర్ మెన్ లకు పూర్తిగా కంట్రోల్ ఉండాలని, కానీ వారికి ఎలాంటి చెక్ పవర్ లేదన్నారు. రూ.500 చెక్ పవర్ మాత్రమే ఉందన్నారు. చిట్ ఫండ్‌లో నగదుపై అసలు వాళ్లకి నియంత్రణ లేదన్నారు. చిట్ ఫండ్స్ నిర్వహణలో అన్ని అధికారాలు హెడ్ ఆఫీస్‌కే ఉన్నాయని అంటున్నారని, హైదరాబాద్ మార్గదర్శి ఆఫీస్ లో తనిఖీలు చేస్తే అక్కడ ఎవరూ సహకరించలేదన్నారు. హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చారన్నారు. ఏపీలో జరిగిన వాటికి సంబంధం లేదని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారని తెలిపారు. ఏపీలో చిట్ వేసిన వాళ్ల డబ్బులు మాత్రం వేరే రాష్ట్రంలో పెడుతున్నారని తెలిపారు.
వేరే కంపెనీలో పెట్టుబడులు
సీఏతో అకౌంట్స్ ను ఆడిట్ చేయించామని ఐజీ రామకృష్ణ తెలిపారు. ఆడిటింగ్ లో కొన్ని మార్గదర్శి బ్యాలన్స్ షీట్లలో నిధులను స్పెక్యులేటివ్ మార్కెట్ లోకి మళ్లించారన్నారు. ఆ నిధులను ఉషా కిరణ్ సంస్థకు మళ్లించారన్నారు. చిట్ ఫండ్ కంపెనీ వేరే వ్యాపారం చెయ్యడానికి వీలు లేదని నిబంధనలు ఉన్నాయన్నారు. కానీ మార్గదర్శి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వేరే కంపెనీలలో పెట్టుబడులు పెట్టారన్నారు. బ్యాంక్ ఖాతాల నుంచి నగదు మళ్లించారని అభియోగం ఉందన్నారు. ఈ నిధులపై పూర్తి విచారణ జరపాల్సి ఉందన్నారు. ఈ విషయంపై ఏడు మార్గదర్శి బ్రాంచ్ లలో సీఐడీకి ఫిర్యాదు చేశామన్నారు. అనుమతి లేకుండా డిపాజిట్లను సేకరిస్తున్నారని ఐడీ రామకృష్ణ తెలిపారు. మార్గదర్శి ఫైనాన్సియల్ సర్వీస్ పై 15 వేల కోట్లు సేకరించినప్పుడు నోటీసులు ఇచ్చామన్నారు.