Minister Prashanth Reddy : ఖమ్మం బీఆర్ఎస్ సభకు వచ్చిన ఆదరణ చూసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మతి భ్రమించిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఏదో ఒక విమర్శ చేయాలని తప్పా ఆయన మాటల్లో అర్థం పర్థం లేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లను విమర్శించడమే బండి సంజయ్ పనిగా పెట్టుకున్నారన్నారు. ఇరుకు గల్లీలో పెట్టుకునే ప్రజా సంగ్రామ సభలో ఎంత మంది ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం బండి సంజయ్ కేంద్రం నుంచి ఏం తెచ్చారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ 8 ఏళ్లలో దేశానికి ఏం చేశారు, ఏం చేయబోతున్నారో ఇవి చెప్పుకోవాలని హితవు పలికారు. మతి భ్రమించి అర్థరం పర్థం లేని మాటలు మాట్లాడవద్దని మంత్రి వేముల సూచించారు.  ఖమ్మం సభకు వచ్చిన జనాన్ని చూసి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇప్పటి వరకు ఇంత పెద్ద సభ చూడలేదన్నారని తెలిపారు. తన కంటికి ఎంత దూరం కనిపిస్తుందో అంతదూరం కంటే ఎక్కువే జనాలు ఉన్నారని చెప్పారన్నారు.  బండి సంజయ్ కు అది కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు. భవిష్యత్ లో బీఆర్ఎస్ సభ ఎక్కడ జరిగినా ఇలాగే  ఉంటుందన్నారు. రైతులకు ఉచిత కరెంట్ గురించి బండి సంజయ్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. 


4 కోట్ల మందికి కంటి పరీక్షలు 


అంతకు ముందు నిజామాబాద్ నగరంలో జరిగిన కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి కంటి వెలుగు కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. ఇది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమo అన్నారు. రాష్ట్రంలో 4 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయం అంటే ఎక్కడో ఉండదని ప్రజల సంక్షేమమే నిజమైన రాజకీయం అని ఇందులోంచి పుట్టినవే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు మంత్రి. కంటి వెలుగును ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వస్తున్నాయని, ఇది సీఎం కేసీఆర్ పనితనానికి నిదర్శనం అన్నారు. తెలంగాణలో అమలవుతున్న ఎన్నో పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. తెలంగాణ కోసం ఏర్పాటైన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నిండు మనసుతో దీవించారని ఇప్పుడు.... దేశవ్యాప్తంగా తెలంగాణ వంటి పథకాలు అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారని చెప్పారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. 


100 రోజుల పాటు 


 నివారించదగ్గ కంటి సమస్యలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని  ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డులు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు క్యాంపుల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమం 100 రోజులపాటు కొనసాగుతుందని అవసరమైన ప్రతి ఒక్కరికి కళ్లజోడు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తో పాటు వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.