Nampally Special court grants bail to BRS leader Patnam Narender Reddy in Lagacharla incident


లఘుచర్లలో కలెక్టర్, ఉన్నతాధికారులపై దాడి ఘటన కేసులో రైతులకు బెయిల్ మంజూరు అయింది. దాడికి ప్లాన్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేంధర్ రెడ్డి సైతం బెయిల్ మంజూరు చేశారు. నాంపల్లి స్పెషల్ కోర్టు మొత్తం 24 మందికి బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి వీరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. పట్నం నరేందర్ రెడ్డి రూ.50 వేల పూచీకత్తు రెండూ సమర్పించాలని, రైతులు రూ.20 వేల పూచీకత్తూ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 


వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులపై దాడి జరగడం సంచలనంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే  నరేందర్ రెడ్డితో పాటు పలువురు రైతులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దాదాపు నెలకు పైగా జైల్లోనే రైతులు, పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఇటీవల రైతులకు బేడీలు అనే విషయం వివాదాస్పదమైంది. తెలంగాణ  ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పట్నం నరేందర్ రెడ్డి మూడు నెలలపాటు ప్రతి బుధవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 


గురువారం ఏ2 సురేష్ బెయిల్ పై విచారణ


ఈ కేసులో మొత్తం 26 మంది అరెస్ట్ కాగా 24 మందికి నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ ఇచ్చిందని న్యాయవాది జక్కుల లక్ష్మణ్ తెలిపారు. 3 నెలల వరకు పోలీసులు దర్యాప్తుకు సహకరించాలని ఆదేశిస్తూ పిడిపిపి కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి బుధవారం పోలీస్ స్టేషన్ ముందుకు A1 మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.. A2 సురేష్ కు బెయిల్ మంజూరు కాలేదు. గురువారం నాడు సురేష్ బెయిల్ పై వాదనలు జరగనున్నాయి.


కొడంగల్ ఫార్మా సిటీ కోసం లగచర్ల రైతుల భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. అయితే తమ భూములు కోల్పోతామని రైతులు ఆందోళన చేపట్టారు. తమ భూముల్ని ఇచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వానికి సైతం పలుమార్లు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, పోలీస్ ఉన్నతాధికారులు లగచర్లకు వెళ్లగా.. రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వారితో మాట్లాడాలని అధికారులను ఏ2 సురేష్ ఆహ్వానించారు. అది నిజమని నమ్మి లగచర్లకు వెళ్లిన అధికారులపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. కలెక్టర్ సహా అధికారుల వాహనాలపై పెద్ద రాళ్లతో దాడి చేసి వాహనాలు ధ్వంసం చేశారు. 


రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు 


అధికారులపై దాడి అంటే అది ప్రభుత్వంపై దాడి అని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని, రైతులను మొత్తం 26 మందిని అరెస్ట్ చేయగా కోర్టు రిమాండ్ విధించడంతో సంగారెడ్డి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విడుదల చేసిన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేర్కొనడం కలకలం రేపింది. ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్రలో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి.. ఏ2 సురేష్ సాయంతో లగచర్ల రైతులను రెచ్చగొట్టారని పోలీసులు చెప్పారు. దాదాపు నెల రోజుల తరువాత ఇద్దరు మినహా మిగతా నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చింది.