Telangana MLC Elections 2024: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుగుతారా..? అని మల్లు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీ స్టూడెంట్ అని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్‌మెయిలర్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
తాజాగా మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బిట్స్ పిలానీలో చదివిన వ్యక్తిని అభ్యర్థిగా పెట్టామని చెబుతున్న బీఆర్‌ఎస్ నాయకులు.. అక్కడ చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుగుతున్నారా..? అని మల్లు రవి ప్రశ్నించారు. బిట్స్ పిలానీలో చదివిన వాళ్లే పట్టభద్రులుగా, మిగిలిన వాళ్లు కాదన్నట్టుగా మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను కించపరుస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పట్టభద్రులపై భారతీయ రాష్ట్ర సమితి నాయకుల వైఖరి ఏమిటో వారి మాటల్లోనే తెలుస్తోందని విమర్శించారు. తీన్మార్ మల్లన్న పోటీకి అర్హుడు కాబట్టే ఎన్నికల కమిషన్ అంగీకరించిందని, కాబట్టి కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పేర్కొన్న మల్లు రవి.. ఈసీ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీ
జూన్ రెండో తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియాగాంధీ విస్తున్నారని మల్లు రవి పేర్కొన్నారు. ఆమెను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నట్టు వివరించారు. తెలంగాణ సాధనకు పని చేసిన అన్ని పార్టీలను వేడుకలకు ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. ఈ నెల 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ గురించి సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారని, ఆ పార్టీలన్నీ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని తీర్మానించాయన్నారు. మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన తరువాత కాంగ్రెస్ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళతారన్నారు. శాసన మండలిలో పట్టభద్రులు, నిరుద్యోగులు, మహిళలు గురించి తీన్మార్ మల్లన్న తన గొంతును వినిపిస్తారని, ఆ నమ్మకం తనకుందని రవి స్పష్టం చేశారు.