సూర్యాపేటలోని మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై తికమక పరిస్థితి ఏర్పడింది. కాలేజీలో సీనియర్ విద్యార్థులు తనను ర్యాగింగ్ చేశారని బాధితుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. ర్యాగింగ్ జరిగిందని పోలీసులు కూడా చెప్పినప్పటికీ.. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నియమించిన కమిటీ మాత్రం ర్యాగింగ్ జరగలేదని తేల్చేసింది. జరిగిన ఘటన మొత్తం న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా జరిగిన గొడవ అని గుర్తించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ వ్యవహారంలో ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేయాల్సిందిగా కమిటీ ఆదేశించింది. ఈ ఆరుగురు విద్యార్థులు 2019-20 బ్యాచ్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్‌కు చెందిన వారు కాగా.. ఆ ఆరుగురు జె.మహేందర్, జి.శశాంక్, పి.శ్రావణ్, ఎ.రంజిత్ సాయి, కె.హరీశ్, బి.సుజీత్ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
వీరు వెంటనే హాస్టల్ ఖాళీ చేసి శాశ్వతంగా వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ విషయాన్ని ఈ విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టికి కూడా తీసుకెళ్లామని కమిటీ వివరించింది. పోలీసులు ర్యాగింగ్ జరిగిందని చెప్పగా.. తాజాగా కమిటీ ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని పరస్ఫర విరుద్ధ ప్రకటన చేయడంతో ఈ వ్యవహారంలో గందరగోళం నెలకొంది.
ర్యాగింగే అని చెప్పిన పోలీసులు
దాదాపు 25 మంది సీనియర్ విద్యార్థులు తనను గదిలో బంధించి ర్యాగింగ్ చేశారని బాధితుడు ఫిర్యాదు చేయగానే.. యాంటీ ర్యాగింగ్ సంబంధిత సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం ర్యాగింగ్ జరిగినట్లుగా సూర్యాపేట ఎస్పీ కూడా వెల్లడించారు. దీనిపై వెంటనే ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పందించి, ప్రత్యేక విచారణ కమిటీని నియమించాలని ఆదేశించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కమిటీని నియమించారు. సోమవారం సాయంత్రం వరకూ విచారణ కమిటీ విచారణ జరిపి ఆ నివేదికను డీఎంఈ రమేశ్ రెడ్డికి అందించారు.
Also Read: Telangana BJP: జేపీ నడ్డాకు హైదరాబాద్ పోలీసుల షాక్.. బండి సంజయ్ సీన్ రిపీట్ అవుతుందా?
బాధితుడి ఫిర్యాదు ఇదీ..
హైదరాబాద్‌లోని మైలార్ దేవుపల్లికి చెందిన విద్యార్థి సూర్యాపేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 15 నుంచి జనవరి 2 వరకు సెలవులు ప్రకటించడంతో ఇంటికి వెళ్లాడు. పరీక్షలు ఉండటంతో ప్రిపేర్ అయ్యేందుకు ఈ నెల 1న రాత్రి 8 గంటలకు మెడికల్ కళాశాలకు సంబంధించిన రెడ్డి హాస్టల్‌కు చేరుకున్నాడు. రాత్రి భోజనం చేసి హాస్టల్‌లోని రెండో ఫ్లోర్‌లోని తన గదికి వెళ్లాడు. రాత్రి 8.40కు సాయి కుమార్‌ను ఫస్ట్ ఫ్లోర్‌కు రమ్మని హరీశ్‌తో పాటు మరికొందరు రెండో సంవత్సరం విద్యార్థులు.. కబురు పంపారు. దీంతో ఫస్ట్ ఫ్లోర్‌కు వచ్చిన సాయిని ఫార్మల్ డ్రెస్, షూ వేసుకురమ్మనగా అతను అలాగే వేసుకొని వచ్చాడు. ఆ తర్వాత దుస్తులు విప్పించి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు.
‘‘వారు నా దుస్తులు విప్పించి సెల్ ఫోన్ లో వీడియో తీశారు. కొంత మంది మద్యం తాగి నాపై దాడికి కూడా పాల్పడ్డారు. అనంతరం ట్రిమ్మర్ తీసుకొని నాకు గుండు గీసేందుకు ప్రయత్నించారు. సీనియర్లు నాలుగు గంటలు గదిలో బంధించి హింసించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సెల్యూట్ చేయించుకోవడమే కాకుండా నాపై పిడి గుద్దులు గుద్దారు. కన్నీరుపెట్టి వేడుకున్నా వదలకుండా ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. టాయిలెట్ వస్తుందని చెప్పి నేను తప్పించుకుని నా గదికి వెళ్లిపోయాను. నా తండ్రికి ఫోన్ చేసి చెప్పాను. ఆయన వెంటనే డయల్ 100 కు ఫిర్యాదు చేశారు.’’ అని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: Kottagudem: దంపతుల సజీవదహనంతో సంబంధం లేదు... వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే కుమారుడు
Also Read: పాల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు కారణం ఆ ఎమ్మెల్యే కొడుకు ! వెదుకుతున్నపోలీసులు...