Nalgonda Cyber crime: తెలంగాణలో నమోదు అవుతున్న సైబర్ కేసుల్లో మరో సంచలనం నమోదు అయింది. నేరగాళ్లతో చేతులు కలిపిన తెలుగు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అనుమానాస్పదంగా ఓ ప్రాంతంలో ఖాతాల్లోకి లక్షల్లో నగదు వచ్చి పడటాన్ని గుర్తించి విచారిస్తే అసలు గుట్టు వెలుగు చూసింది. 


వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటూ వేలి కొనలతోనే వేల మందిని బురిడీ కొట్టించి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఇలాంటి సైబర్ కేటుగాళ్లకు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యక్తి సహాయం చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. సైబర్ క్రిమినల్స్‌తో ఉన్న లింక్‌లు మరింతగా తెలుసుకునేందుకు ఆయన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. 


మిర్యాలగూడకు చెందిన అన్నభిమోజు నాగార్జున చారి స్థానికంగా ఓ పార్టీలో తిరుగుతూ లీడర్‌గా చెలామణి అవుతున్నాడు. ఈయనే ముంబైలో ఉంటూ సైబర్ నేరాలకు పాల్పడే వాళ్లకు సహాయం చేస్తున్నట్టు పోలీసులు పసిగట్టారు. అక్కడి నుంచి దుబాయ్‌లో ఉన్న మోసగాళ్లకు కూడా లింకులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. 


ఈ మ‌ధ్య కాలంలో మిర్యాలగూడకు చెందిన కొందరి అకౌంట్లలో భారీగా నగదు పడింది. రోజుల వ్యవధిలోనే లక్షల్లో నగదు పడటంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చింది. వారు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. విచారణ జరిపిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగు చూశాయి. 


ఖాతాదారులకు కమిషన్


మిర్యాలగూడలో ఉండే అమాయకుల పేర్లతో నాగార్జున చారీ అకౌంట్లు ఓపెన్ చేయించే వాడు. ముంబైలోని కేటుగాళ్లతో సంబంధాలు పెట్టుకొని ఈ ఖాతాల్లోకి నగదును జమ చేయించే వాడు. ఇందులో కొంత వాటా వాళ్లకు ఇచ్చి మిగతా నగదును నాగార్జున చారీ ఉంచుకునే వాడు. 


ఇలా గుర్తించిన పోలీసులు 


లక్షల రూపాయలు నగదు పడిన ఖాతాలను గుర్తించిన పోలీసులు, వారిని ప్రశ్నించారు. ఎక్కడి నుంచి ఎవరు వేస్తున్నారో తమకు తెలియదని... నాగార్జున చారీ చెప్పడంతో ఇలా చేశామని ఒప్పుకున్నారట. తమకు వాటా కింద కొంత నగదు ఇస్తారని మరికొంత తనే తీసుకుంటారని కూడా వివరించారు. దీంతో అదన్ని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. 


అసలు ఈ ఆపరేషన్ ఎలా జరుగుతోంది. ఎక్కడి నుంచి ఎలా ఆపరేట్ చేస్తారనే విషయాలపై నాగార్జున చారీని పోలీసులు గ్రిల్ చేస్తున్నారు. మిర్యాలగూడ టు దుబాయ్‌ వయా ముంబై అన్నట్టు ఈ కేసు దర్యాప్తు సాగుతోంది. 


Also Read: హైడ్రా, మూసీ ప్రాజెక్టులకు తొలగిన చట్ట, న్యాయపరమైన అడ్డంకులు - కానీ చల్లబడిపోయిన రేవంత్ - ముందుకు సాగుతాయా ?