తెలుగు రాష్ట్రాల‌్లో సంచలనంగా మారిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావుపై కేసు నమోదు కావడంతోపాటు వెంటనే హడావుడి చేసిన పోలీసులు తర్వాత సైలెంట్‌ అయిపోయారు. రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని ప్రకటించి రోజులు గడుస్తున్న ఇంత వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ కేసును దర్యాప్తు చేసిన ఐపీఎస్‌ అధికారి ఏఎస్పీ రోహిత్‌రాజు రాఘవేంద్రరావుపై 12 కేసుల్లో తీవ్ర నేరారోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. అతనిపై రౌడీషీట్‌ నమోదు చేస్తామని ప్రకటించారు. రాఘవను రిమాండ్‌ చేసి రోజులు గడుస్తున్నా రౌడీషీట్‌ ఇప్పటి వరకు ఓపెన్‌ కాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  రాఘవకు ప్రభుత్వ పెద్దల నుంచి సహకారం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే పోలీసులు ఈ విషయంలో వెనుకంజ వేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. సాధారణ వ్యక్తులు ఎవరైనా రెండు మూడు తీవ్ర నేరారోపణలు ఉన్న కేసుల్లో ఉంటే వారిపై వెంటనే రౌడీషీట్‌ నమోదు చేస్తారు. అవసరమైతే పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేస్తారు. కానీ రాఘవ విషయంలో ఆ దిశగా ముందుకు సాగకపోవడంపై ఒత్తిడి ఉందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. 


ఇద్దరు నేతలు మద్దతు పలుకుతున్నారా..?
వనమా రాఘవేంద్రరావు ఇప్పటి వరకు చేసిన అరాచకాలు, భూకజ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. రామకృష్ణ ఉదంతంపై చర్చ జరగడంతో హడావుడిగా స్పందించిన అధికార పార్టీ రాఘవను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అదే వేడిలో అతనిపై రౌడీషీట్‌ ఓపెన్ చేస్తామని పోలీసులు ప్రకటించారు. కొద్ది రోజులపాటు ఈ విషయంలో స్తబ్ధుగా ఉండటంతో అనేక అనుమానాలు తలెత్తున్నాయి. అధికార పార్టీలోని ఓ నేతకు పెద్ద ఎత్తున సొమ్ములు ముట్టజెప్పి ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.


ఉమ్మడి ఖమ్మం జిల్లాతో సంబంధాలు ఉన్న ఇద్దరు కీలక నేతలు ఈ విషయంలో వనమా రాఘవకు మద్దతుగా ప్రభుత్వ పెద్దల నుంచి పోలీసులపై ఒత్తిడి తెచ్చారా..? అనే విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో రౌడీషీట్‌కు సంబందించిన ఫైలు పూర్తి చేసినప్పటికీ అది పెండింగ్‌లోనే ఉంది. ఏది ఏమైనప్పటికీ కేవలం ఎమ్మెల్యే కుమారుడు కావడంతోపాటు అధికార పార్టీకి చెందిన నేతల సహకారంతోనే రాఘవపై రౌడీషీట్‌ నమోదు కావడం లేదని, ఆ దిశగా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


Also Read: వ్యాయామం చేస్తుండగా మందలించిన తల్లి... కోపంతో తల్లిని హత్య చేసిన కొడుకు... అడ్డొచ్చిన చెల్లిపై దాడి


Also Read: కార్వీ ఎండీ పార్థసారథి అరెస్టు... రూ.1500 కోట్ల మేర అవకతవకలు గుర్తించిన ఈడీ...!