స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ ఎండీ పార్థసారథిని ఈడీ ఇవాళ అరెస్ట్‌ చేసింది. బెంగళూరులో ఉంటున్న ఆయనను ఈడీ అధికారులు పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకొచ్చారు. చంచల్‌గూడ జైలుకు ఆయనను తరలించారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో... ఆయా బ్యాంకులు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట కార్వీ మోసానికి పాల్పడిందని పోలీసుల విచారణలో తేలింది. మనీలాండరింగ్‌ జరిగిందని నిర్ధారణ అవ్వడంతో ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టింది. ఇన్వెష్టర్ల షేర్లను పార్థసారథి తన సొంత ఖాతాలకు మళ్లించారని, వాటిని తనఖా పెట్టి బ్యాంకు రుణాలు పొందారని ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే పార్థసారథిని ప్రశ్నించిన ఈడీ ఆయన ఆఫీసు, ఇళ్లలో కీలక ఆధారాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ వ్యవహారంలో రూ.1500 కోట్ల మేర మోసం జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. చంచల్‌గూడ జైలులో ఉన్న పార్థసారథిని ఈడీ తమ కస్టడీకి తీసుకునే అవకాశముంది.


Also Read: కార్వీ ఆఫీసు, ఆస్తులపై పలుచోట్ల ఈడీ దాడులు.. బెంగళూరు పోలీసుల కస్టడీకి మాజీ ఎండీ పార్థసారధి


 కార్వీ లైసెన్స్ లు రద్దు


కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కస్టమర్ల సెక్యూరిటీలను సొంతం ఖాతాలకు మళ్లించి తమ అవసరాలకు ఉపయోగించుకుంది. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్ఎస్ఈ కార్వీ స్టాక్ బ్రోకింగ్ ట్రేడింగ్ లైసెన్స్‌ను రద్దు చేశాయి. దీనికి సంబంధించి రెండు రెగ్యులేటరీ సంస్థలు ఇప్పటికే ప్రకటన విడుదల చేశాయి. కార్వీ సంస్థపై మార్కెట్‌ రెగ్యులేటర్ సెబీ కూడా నిషేధం విధించింది. కార్వీ సంస్థ ఏకంగా రూ.1500 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్ లైసెన్స్‌ను మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ(ఎంసీఎక్స్) ఇప్పటికే రద్దు చేసింది. దీంతో కార్వీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లు ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్ చేయలేరు. 


సెబీ ఆంక్షలు


పెట్టుబడిదారుల ఇన్వెస్ట్మెంట్లను సొంత అవసరాల కోసం దుర్వినియోగం చేసినందుకు సెబీ కార్వీపై చర్యలు తీసుకుంది. కొత్త ఖాతాదారులను తీసుకోకుండా ఆంక్షలు పెట్టింది. ప్రస్తుత ఖాతాదారులకు సంబంధించిన పవర్‌ ఆఫ్‌ ఆటార్నీపై కూడా గతంలో ఆంక్షలు విధించింది సెబీ. కార్వీ స్టాక్ బ్రోకింగ్ క్లయింట్ల సెక్యూరిటీలను సొంత అవసరాల కోసం బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణం పొందిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బును సంస్థకు చెందిన రియాల్టీ కంపెనీలోకి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాలపై దర్యాప్తు జరుగుతోంది. 


Also Read: బ్యాంకులకు కట్టాల్సిన రుణాలు ఎగ్గొట్టిన కేసులో కార్వీ సంస్థ ఎండీ అరెస్టు.. పార్థసారథిపై భారీ అభియోగాలు!